ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టి రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రయివేట్ మెంబర్ బిల్లు పై పార్లమెంటులో జులై 22 శుక్రవారం నాడు చర్చ ఓటింగ్ జరుగుతాయి. ఈ మేరకు రేపటి ఎజెండాలో 14 వ అంశంగా ప్రయివేటు బిల్లుని చేర్చారు. అంటే రేపు మధ్యాహ్నం 3-4 గంటల మధ్య ఈ అంశం చర్చకు రావలసి వుంది.
ప్రజల్లో సెంటిమెంటు గా బలపడుతున్న ప్రత్యేకహోదా కు ఆంధ్రప్రదేశ్ లో ఏపార్టీ వ్యతిరేకంగా మాట్లాడే ఏపార్టీకీ భవిష్యత్తు వుండదు. దీన్ని దృష్టిలో వుంచుకునే కెవిపి ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయరాదని తెలుగుదేశం నిర్ణయించుకుంది.
బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడమంటే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాల సంకీర్ణతకు అర్ధమే లేకుండా పోతూంది. దీనిపై ముందుగానే ప్రజల్లో చర్చకు ఆస్కారం ఇవ్వరాదన్న ఎత్తుగడతో తెలుగుదేశం నాయకులు ” కెవిపి బిల్లుకి అనుకూలంగా ఓటు వేస్తున్నాము” అని క్లుప్తంగా చెప్పేశారు.
తెలుగుదేశం ”ఇబ్బంది ని బాగా అర్ధం చేసుకున్న” బిజెపికి మిత్రపక్షం మీద కోపంలేదు. చకచకా ఆత్మరక్షణ వ్యూహాలు మొదలయ్యాయి. ఎజెండాలో వచ్చిన నెంబరు ప్రకారం సభ చివరి సమయానికే చర్చకు వస్తుంది. విభజనకు ఎవరు కారకులో ప్రస్తావనకు వస్తుంది. గొడవలు అనివార్యమౌతాయి. ప్రశాంతత కోసం స్పీకర్ పదేపదే విజ్ఞప్తులు చేస్తారు.అయినా పరిస్ధితి చక్కబడదు. విధిలేని స్ధితిలో స్పీకర్ సభను వాయిదా వేస్తారు…లేదా డివిజన్ (హెడ్ కౌంటు లేకుండానే మూజువాణి ఓటు ద్వారా తీర్మానం వీగిపోయిందని ప్రకటిస్తారు.
కరెంటు ఆపి, తలుపులు మూసి, విభజన బిల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ప్రత్యేక హోదా వంటి ఇష్టంలేని బిల్లులను తిరస్కరించడానికి దారిచూపించింది.
ప్రత్యేక హోదా బిల్లుని వ్యతిరేకించడంలో తెలుగుదేశానికి వున్న ఇబ్బంది ని బిజెపి ఎలా ”అర్ధం” చేసుకుందో, ఈ బిల్లు ఓటింగ్ వరకూ రాకూడదన్న బిజెపి ఆలోచనను కూడా తెలుగుదేశం అలాగే ”అర్ధం” చేసుకుంది.
విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ”కర్ర విరగదు – పాము చావదు” అనే మిత్రపక్షాల ఆటను మనం చూడబోతున్నాము.