నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తరువాత ఇది రెఫరెండమే కాదని వైకాపా మాట మార్చేసింది! నిన్న జగన్ కూడా అదే చెప్పారు. నేడు కొడాలి నాని వంటి నాయకులు కూడా అదే మాటకు కట్టుబడి ఉంటున్నారు! ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలనీ, అప్పుడు అసలైన రెఫరెండమ్ అవుతుందని కొత్త పాట అందుకున్నారు. వారు ఎంత కాదంటున్నా సరే.. నంద్యాల ఉప ఎన్నిక ప్రభావం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ సమీకరణలపై ఉందనేది వాస్తవం! ముఖ్యంగా కేంద్రంలోని అధికారంలో ఉన్న భాజపా ఆలోచనపై చాలా కథనాలు వినిపిస్తున్నాయి. వైకాపాతో పొత్తు ఉండే అవకాశం లేదనీ, టీడీపీతోనే కొనసాగేందుకు భాజపా సుముఖంగా ఉన్నట్టు చాలా విశ్లేషణలు వస్తున్నాయి. ఇంతకీ, ఒక ఉప ఎన్నిక ఫలితం భాజపాని అంతగా ఎందుకు ప్రభావితం చేసింది..? నంద్యాల ఫలితాన్ని భాజపా ఏ కోణం నుంచి చూసింది..? నంద్యాల నేపథ్యంగా టీడీపీ వైకాపాల మధ్య భాజపాకి కనిపించిన ఆ తేడా ఏంటీ.. అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
నిజానికి, ఈ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీకి రెండు విధాలుగా ఉపయోగపడిందని చెప్పాలి. ఒకటీ.. మూడున్నరేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రచారం చేసుకోవడానికి. రెండోది.. డోలయామానంలో ఉన్న భాజపా పొత్తు వ్యవహారంపై ఒక స్పష్టత రావడానికి! ఆంధ్రాలో భాజపా సొంతంగా ఎదిగే అవకాశం ఇప్పట్లో లేదనేది వాస్తవం. వాళ్ల టార్గెట్ 2024 వరకూ పెట్టుకున్నారు! ఈలోగా కేంద్రంలోని అవసరాల దృష్ట్యా ఆంధ్రాలో తెలుగుదేశంతోనే కొనసాగాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే, ఇటీవలి కాలంలో జగన్ ను మచ్చిక చేసుకుంటున్నట్టుగా కనిపించినా.. నంద్యాల ఫలితంతో ఆ వ్యూహం సరైంది కాదనే ఆలోచనకు భాజపా వచ్చినట్టు చెబుతున్నారు. కొన్నాళ్లపాటు అంటీ ముట్టనట్టు ఉంటేనే సరైందనే నిర్ణయానికి భాజపాకి వచ్చినట్టు వినిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో భాజపా చూసింది ఏంటంటే… తెలుగుదేశం ఒంటరి పోరాటం!
భూమా కుటుంబానికి పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తారని అనుకున్నారు. మంత్రి అఖిల ప్రియ కూడా ఆ విషయం ప్రచారం చేసుకున్నారు. పవన్ మద్దతు తమకే ఉంటుందని చెప్పుకున్నారు. కానీ, తాను తటస్థంగా ఉంటున్నట్టు పవన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక, నంద్యాల ఎన్నికల్లో భాజపా కూడా టీడీపీకి పెద్దగా మద్దతు ఇచ్చిందేం లేదు. దీంతో టీడీపీ ఒంటరిగానే భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. సో… ఈ క్రమంలో భాజపాకి కనిపించింది ఏంటంటే.. చంద్రబాబు వ్యూహం! వైకాపా అధినేత జగన్ తో పోల్చుకుంటే, నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వ్యూహాత్మక ప్రచారం భాజపాకి ఆకర్షించిందని అంటున్నారు.
పార్టీ శ్రేణులనూ నాయకులనూ మంత్రులను దశలువారీగా నంద్యాలలో ఒక ప్రణాళిక ప్రకారం నడిపించగలిగారనేది అమిత్ షాకు చేరిన రిపోర్టుగా చెబుతున్నారు! నంద్యాల ఉప ఎన్నిక ద్వారా భాజపా గమనించింది ఇదే అని అంటున్నారు. ఇదే తరుణంలో, భాజపాకి దగ్గరవుదామని ఆశించిన వైకాపా విషయంలో కనిపించనిది కూడా ఈ వ్యూహరచనే అనడంలో సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక, ఫలితాల నేపథ్యంలో భాజపా లెక్కలు ఇలానే ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. మూడున్నరేళ్ల టీడీపీ పాలనకు ఇది రెఫరెండమా కాదా అనే చర్చను పక్కను పెట్టేస్తే… పార్టీల మధ్య రాజకీయ సమీకరణలను ప్రభావితం చేశాయనడంలో సందేహం లేదు.