దుబ్బాక ఎన్నికల్లో గెలిచేయబోతున్నామని హోప్స్ పెట్టుకున్న బీజేపీ .. గ్రేటర్ ఎన్నికలపై పూర్తి స్థాయి నజర్ పెట్టింది. ఇప్పటికిప్పుడు తమ క్యాడర్ ను పెంచుకోవడం కష్టం కాబట్టి. ఓవర్ లోడ్‌తో ఉన్న టీఆర్ఎస్లోని అసంతృప్త నేతల్ని గురి పెట్టింది. ఇప్పటికే అంతర్గతంగా ఆపరేషన్ ప్రారంభించింది. టీఆర్ఎస్లో చేరి.. పెద్దగా ప్రాధాన్యం లేని నేతల్ని గుర్తించి.. జాబితా తయారు చేసుకుంది. అలాగే ఎమ్మెల్యేలతో విబేధాలున్న నేతల్ని కూడా గుర్తించి.. చర్చలు ప్రారంభించింది. ముందుగా బీజేపీ ప్రయత్నాలు ఫలించి.. మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కమలం గూటికి చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి గెలిచారు. అయితే ఆమె టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి కూడా పొందారు. అప్పట్నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో తీగల వర్గానికి పని లేకుండా పోయింది. తీగల కూడా సైలెంట్ గానే ఉన్నారు. అడపాదడపా.. సబిత, తీగల వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో… తన వర్గాన్ని కాపాడుకోవాలంటే ఆయన పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దీన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది. అలాగే..టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న ఇతర నేతలను కూడా చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు . టీఆర్ఎస్లో టిక్కెట్ దక్కని.. ఎమ్మెల్యేలతో విబేధాలున్న కార్పొరేటర్లకు బీజేపీ కండువా కప్పే ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికలపై నేరుగా కిషన్ రెడ్డి దృష్టి పెట్టడంతో ముందు ముందు మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నారు.