భారతీయ జనతా పార్టీ నేతలు..మాటకంటే ముందు మాది ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ అని ప్రకటనలు చేస్తూంటారు. చాలా మంది… నిజమే… ఎలక్టోరల్ బాండ్ల దగ్గర్నుంచి.. పార్టీకి వచ్చే చందాలు అన్నీ వేల కోట్లలో ఉంటాయి.. దానికి తగ్గట్లుగా త్రిపుర లాంటి అతి చిన్న రాష్ట్రంలోనూ వందల కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి… నిజంగానే పెద్ద పార్టీ అని ఫిక్సయిపోతూంటారు. కానీ వాస్తవానికి బీజేపీ నేతల ఉద్దేశంలో పెద్ద పార్టీ .. ఎక్కువ మంది సభ్యులున్న పార్టీ అన్నమాట. చైనాలో నిరంతరాయంగా అధికారంలో ఉండే కమ్యూనిస్టు పార్టీ కన్నా… తమకే ఎక్కువ మంది సభ్యులున్నారని… బీజేపీ నేతలు భుజాలు చరుచుకుటూ ఉంటారు. ఆ సభ్యత్వంలో డొల్ల ఏమిటో… తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయింది. బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిలో సగం మందికి ఆ పార్టీకి ఓటేయలేదు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలు.. తమ పార్టీకి … 22 లక్షల మంది సభ్యత్వం ఉందని ఘనంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది పధ్నాలుగు లక్షల యాభై వేల ఓట్లు. అదేమిటి.. కార్యకర్తలు అందరూ ఓట్లేసినా… 22 లక్షల ఓట్లు రావాలి కదా.. అని తెలంగాణ బీజేపీ అగ్రనేతలు మథన పడిపోతున్నారు. తమ పార్టీకి కార్యకర్తలు కూడా ఎందుకు ఓటేయలేదని విశ్లేషణ ప్రారంభించారు. కొన్ని చోట్ల పోటీ చేయలేదు కాబట్టి.. ఓట్లు వేయలేదని చెప్పుకునే కారణం కూడా చెప్పుకోవడానికి లేకుండా పోయింది.. ఎందుకంటే.. వారు తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేశారు. 119 నియోజకర్గాల్లోనూ కమలం గుర్తు కనిపించేలా చూసుకున్నారు. కానీ ఆ సంతృప్తే మిగిలింది. మిగిలిన పరువు పోయింది.
118 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోయాయి. చాలా చోట్ల సభ్యులు కూడా ఓట్లేయలేదు. కార్యకర్తలే వేయలేదంటే.. ఇక సామాన్య ప్రజలు ఎందుకు వేస్తారని.. సెటైర్లు.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ భవన్లో వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీకి వచ్చిన ఓట్లు పరిస్థితి చూస్తూంటే… సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ లో కూడా… తీవ్రంగా కష్టపడాల్సి రావొచ్చు. గెలవడానికి కాదు… డిపాజిట్ దక్కించుకోవడానికి..!