తెలంగాణ రాష్ట్ర సమితిలోని అసంతృప్త నేతల్ని చేర్చుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్లు రెడీ చేస్తోంది. దీనికి ముహుర్తం కూడా ఖరారాయింది. బెంగాల్ తరహాలో …పార్టీపై ఏ మాత్రం అసంతృప్తితో ఉన్నా.. టీఆర్ఎస్ నేతలకు బంపర్ ఆఫర్లు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాల్సి ఉంది. తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఆరుగురు శాసనమండలి సభ్యుల పదవీకాలం జూన్ 3 తో ముగిసింది. వీరిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితోపాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసింది.
ఇప్పుడు ఈ స్థానాలకు ఆశావహులు పోటీపడుతున్నారు. పోటీ పడుతున్న వారి సంఖ్య కనీసం ఇరవై వరకూ ఉంది. అందరికీ కేసీఆర్ గట్టి హామీ ఇచ్చి ఉన్నారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి. తక్కెళ్లపల్లి రవీందర్ రావు , నాగార్జున సాగర్ ఉపఎన్నికల సందర్భంగా హమీ ఇచ్చిన కోటి రెడ్డి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతాతమ విధేయతా ప్రకటనలుచేస్తున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఆశతో ఉన్నారు.సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్ , ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , బొంతు రామ్మోహన్ , కేసీఆర్ అనుచరులు శ్రవణ్ రెడ్డి , టీఆర్ఎస్ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి , పన్యాల భూపతి రెడ్డి, కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ కూడా ఆశలు పెట్టుకున్నారు.
వీరందరికి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే… టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవుల భర్తీ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టాలని టీబీజేపీ నిర్ణయించుకుంది. టీఆర్ఎస్లో చాలామంది అసమ్మతి నేతలు ఉన్నారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్లో ఉన్న బడా వ్యాపార వేత్తలపై దృష్టి సారించింది. సరైన గుర్తింపు లేక ఏళ్ల తరబడి ఉన్న నేతలతోపాటు పదవులు రాకుండా అసంతృప్తిలో ఉన్న నేతలను చేర్చుకునేందుకు టీబీజేపీ ప్లాన్ రెడీ చేసింది. కేంద్ర పెద్దలు ఇందులో భాగమవుతారు కాబట్టి.. వలస భారీగా ఉంటుందని చెబుతున్నారు.