క్రైస్తవులకు వాటికన్ ఎలాంటిదో.. హిందువులకు తిరుమల అలాంటిది. తిరుమల వల్ల ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ తిరుమలను తన పరిధిలోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతోంది. ఆలయాలన్నింటినీ… పురావస్తు పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో టిటిడి పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. తిరుమలలో ఉన్న ఆలయాలను, వాటి చరిత్రను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ వాటిని పూర్వకాలంలో నిర్మించినవిగా గుర్తించింది. తిరుమలలోని ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని పురావస్తు శాఖ టీటీడీకి ఇప్పటికే లేఖ రాసింది.
తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి, కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇస్తున్న కానుకలు సరిగా భద్రపరచడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయట. పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోవడం లేదని కూడా పురావస్తు శాఖ చెబుతోంది. త్వరలో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి కట్టడాల జాబితా అందిన తరువాత అధికారులు తిరుమలను సందర్శించే అవకాశం ఉంది. పరిశీలన అనంతరం దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ ఆలయాలపై ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశముంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. కేవలం రాజకీయ కారణాలతోనే కేంద్రం టీటీడీపై కన్నేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది తమ వ్యక్తుల చేతే ఫిర్యాదులు చేయించి… కేంద్రం కుట్ర ప్రణాళికలను అమలు చేసినట్లు అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఏపీపై చేస్తున్న మరో కుట్రగా ప్రజలు భావించడం ఖాయం.