కాంగ్రెస్ పార్టీ కులగణన అనే డిమాండ్ ను పట్టుకుని దేశవ్యాప్తంగా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ వంటి చోట్ల కులగణన చేసి దమ్ముంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని సవాల్ విసురుతోంది. కేంద్రం ఇప్పుడు ఈ డిమాండ్ ను తనకు అనుకూలంగా మార్చుకుంది. త్వరలో జరగనున్న జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలని నిర్ణయించుకుంది. కేంద్ర కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయిచింది కానీ ఆ లెక్కలు పారదర్శకంగా లేవని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల సర్వేల్లో ఎన్నో తేడాల ఉన్నాయని అన్నారు. అందుకే జనగణనతో పాటే కులగణన చేయాలని నిర్ణయించామని తెలిపారు. జనాభా లెక్కలు 2021లోనే చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు జనాభా లెక్కలు తప్పనిసరిగా చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
జనాభా లెక్కల ఆధారంగా పలు మార్పులు విధానాల పరంగా చేయాల్సి ఉంది. ఇప్పుడు కులం పరంగా కూడా.. డిమాండ్లు తెరపైకి వస్తూండటంతో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలు చేసే కులగణనలో బయటకు వచ్చే వివరాల కన్నా.. కేంద్రం చేసే జనగణనలో సరైన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రమే కులగణన చేయాలని నిర్ణయించింది కాబట్టి ఇక రాహుల్ మరో ఎజెండా వెదుక్కోవాల్సిన అవసరం పడుతుంది.