మమతా బెనర్జీని బీజేపీ సంప్రదాయ భావజాలంతో గెలవడం కష్టమని అనుకుంటున్నారేమో కానీ… బెంగాల్లో బీజేపీ రాష్ట్ర విభజన వ్యూహాన్నితెరపైకి తెచ్చింది. బెంగాల్‌ను మూడు ముక్కలు చేయాలని డిమాండ్ ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేని పేద బతుకులు మారడం లేదని కన్నీరు ప్రారంభించింది. కొత్తగా ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. తృణమూల్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని… కొత్త రాష్ట్రాల డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని ఆయనప్రకటించారు.
తమకు బలం లేని చోట రాష్ట్రాలను విడగొట్టి విభజన ఉద్యమాలకు మద్దతిచ్చి బలం పెంచుకోవడం.. బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్ వ్యూహం. బెంగాల్లో డార్జిలింగ్, దాని పరిసర ప్రాంతాలను గోర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ బిజెపి రాజకీయ లాభం పొందింది. ఇటీవల ఒక్క డార్జిలింగ్ ప్రాంతం కాకుండా మొత్తం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలనే డిమాండ్ వినిపించడం ప్రారంభించారు. మూడు నెలల క్రితం సువేందు అధికారి నైరుతి ప్రాంతం ప్రజలంతా విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ దీనికి మద్దతు ప్రకటించారు.
ఉత్తర బెంగాల్ భగీరధీ-హ్లుగీకి ఉత్తరాన ఎనిమిది జిల్లాలతో ఉంది. ఇది హిమాలయాల వరకు విస్తరించింది. నైరుతి ప్రాంతం ఐదు జిల్లాల మిళితం. ఒడిశా, జార్ఖండ్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలను కలిపితే 42 లోక్‌సభ స్థానాలకు గానూ… 16 స్థానాలు ఉంటాయి. ఇక 109 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 77 అసెంబ్లీ సీట్లలో 53 ఈ ప్రాంతాల్లోనివే. అందుకే బిజెపి నైరుతి, ఉత్తర బెంగాల్ రెండు రాష్ట్రాలుగా విభజించాలనే డిమాండ్‌కు మద్దతు తెలుపుతోందని భావిస్తున్నారు.
బెంగాల్ నుండి ఉత్తర బెంగాల్, జంగల్ మహల్లు విడిపోవాలనుకుంటే…తాము మద్దతిస్తామన్నరు. ఉత్తర బెంగాల్లో అభివృద్ధి ఎందుకు నోచుకోలేదని, పాఠశాలలు, కళాశాలు, ఆసుపత్రి, పరిశ్రమలు ఎందుకు లేవని… ఇదే పరిస్థితి జంగల్ మహల్లో కూడా ఉందని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక.. రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. బీజేపీ విధానానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు.