తమిళనాడులో శశికళ తరహాలో.. ఆంధ్రలోనూ.. భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉండబోతోందన్న ప్రచారం.. ఊపందుకుంటున్న సమయంలో.. అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డికి బంధువుగా మారి.. ఆయనను బ్లైండ్‌గా అభిమానించేసి.. ఆ పార్టీలో కూడా చేరిన.. మంచు మోహన్ బాబు.. చడీచప్పుడు లేకుండా.. బీజేపీలో చేరడానికి.. సంసిద్ధలైపోయారు. మోడీతో సమావేశమై మరీ.. తన అభీష్టాన్ని చెప్పారు. త్వరలో ఆయన రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో.. బీజేపీలో చేరడం లాంఛనమే. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ. ఆయన జగన్‌కి బంధువు కూడా.. కోరుకుంటే.. జగన్ ఏదో పదవి మాత్రమే కాదు.. ఆర్థికంగా ప్రయోజనం కల్పించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ.. మంచు మోహన్ బాబు.. ఎందుకు బీజేపీ వైపు మొగ్గారన్నది ఆసక్తికరం.
రాజకీయంగా.. ఎక్కడైనా ఓ స్టెప్ వేయాలంటే.. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దానికి తమిళనాడులో శశికళ ఉదంతమే కీలకం. శశికళకు..అన్నాడీఎంకే తిరుగులేని ఆదరణ ఉంది. ప్రజల్లోనూ ఇమేజ్ ఉంది. కానీ.. ఆమెపై వ్యతిరేకత పెంచి.. సన్నిహితుల్ని క్రమంగా దూరంగా… వెంటనే జైలు శిక్ష పడేలా చేశారు. ఫలితంగా.. అందరూ దూరమయ్యారు. తమిళనాడులో అసలు ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి. ఇప్పుడు.. ఏపీలోనూ అలాంటి పరిస్థితే తీసుకొస్తున్నారా.. అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. మోహన్‌బాబు.. తనంతట తానుగా.. వెళ్లి బీజేపీలో చేరే ఆసక్తి ప్రదర్శించే అవకాశం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకే.. ఆయన కాషాయం ఆకర్షణకు లోనయ్యారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని విషయం. అందుకే.. బీజేపీ తమిళనాడు ఫార్ములాని ఏపీలో ప్రయోగిస్తుందా..అన్న చర్చ జరుగుతోంది.
ఏపీలో జగ్మన్మోహన్ రెడ్డి పాలన చేపట్టి ఏడు నెలలు మాత్రమే అయింది. కానీ ఆయన.. ఒక్క వర్గాన్ని పూర్తిగా సంతృప్తి పరచలేకపోగా… ప్రతీ విషయంలోనూ… ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేశారు. ఆయన నిర్ణయాలు.. ప్రజలందరిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించాయి. ఒక్క కులాన్ని టార్గెట్ గా చేసుకుని పాలన చేస్తున్నా… దాని వల్ల ప్రజలందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభావం చాలా స్పష్టంగా కనబడుతున్న సూచనలున్నాయి. మరో ఒకటి, రెండు నెలల్లో.. ఏపీలో.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నది.. ఆర్థిక నిపుణుల అంచనా. అప్పుడు ప్రభుత్వంపై.. తీవ్ర స్థాయి వ్యతిరేకత ప్రారంభమయింది. బహుశా.. అప్పటి ఆపరేషన్‌కు బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించి ఉంటుందేమోనని భావిస్తున్నారు.