ఈటల రాజేందర్ ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత మంచి స్వింగ్ లో ఉన్న బీజేపీ గత కొంత కాలంగా వెనుకబడింది. మళ్లీ రేసులోకి రావాలంటే.. ఈటలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారు. ఈటల రాజేందర్ తో రహస్య సమావేశాన్ని సైతం బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయనేత భూపేందర్ యాదవ్ సైతం పాల్గొన్నారని తెలుస్తోంది. ఈటలకు కాషాయ కండువా కప్పే బాధ్యతను బీజేపీ జాతీయ నాయకత్వం ట్రబుల్ షూటర్ భూపేందర్ యాదవ్ కు అప్పగించినట్లుగా తెలంగాణ బీజేపీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. బీజేపీ లో మోదీ, అమిత్ షాల తర్వాత ముఖ్యనేతల్లో భూపేందర్ యాదవ్ ఒకరు.
బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల చేరికతో బీజేపీ బలం పెరుగుతోందని కమలనాథులు అంచనా వేస్తున్నారట. ఈటలకు ఉత్తర తెలంగాణలో మంచి పలుకుబడే ఉంది. ఈటలను చేర్చుకుంటే టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు, బలమైన మాజీ ఎమ్మెల్యేలు సైతం వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా ఈటలకు కాషాయ కండువా కప్పాలన్న పట్టుదలతో బీజేపీ ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్, కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న నాయకులను కొన్నిరోజులుగా ఈటల కలుస్తున్నారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయితే తనకు సహకరించాలని అందరినీ ఈటల కోరుతున్నారు. కానీ బీజేపీలో చేరాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.
బీజేపీలోకి వస్తే … బండి సంజయ్ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే రేవంత్ రెడ్డి వంటి నేతలు బీజేపీలో గ్రూపులున్నాయని.. ఈటల అక్కడకు వెళ్తే బలైపోతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈటల రాజేందర్ తాను సొంతంగా రాజకీయ బాట ఎంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం ఈటల వైపు చూస్తోంది.