జమిలి ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్తోంది. ఓ వైపు ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తూ..రాజకీయ పార్టీలకు సందేశం పంపుతోంది. మొదటగా ప్రధాని నోట.. జమిలీ ఎన్నికల మాట వచ్చింది. దాంతో అందరూ అలర్ట్ అయ్యారు. దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. ఒకే దేశం – ఒకే ఎన్నిక అనేది అత్యంత అవశ్యమని ఆయన చెబుతున్నారు. ఈ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నేతలు. వరుసగా వారం రోజుల పాటు వెబినార్లు నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు.. ప్రముఖులతో ఈ వెబినార్లు జరుగుతాయి.
నిజానికి రైతుల ఆందోళనల కారణంగా.. వ్యవసాయ చట్టాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని బీజేపీ టాస్క్‌గా పెట్టుకుంది. ఆ పనిలో బిజీగా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు.. సమావేశాలు పెడుతున్నారు. రైతులతో మాట్లాడుతున్నారు. వారి వ్యవహారాల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారతీయజనతా పార్టీ… జమిలీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. రైతు అంశంతో పాటు… జమిలీ ఎన్నికలకు తాము అనుకున్నట్లుగా ముందుకెళ్లడం… చాలా కీలకమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే.. ఎక్కడా వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు. ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే ప్రధాని నోటి వెంట జమిలీ మాట వచ్చింది. అదే సమయంలో.. తాము రెడీగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇప్పటికే… జమిలీ ఎన్నికలు పెట్టాలంటే….. రాజ్యాంగ పరంగా ఎలాంటి సవరణలు చేయాలో…ఇప్పటికే లా కమిషన్ తో సహా నివేదిక సమర్పించింది. వాటికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయని అంటున్నారు. 2022లోనే జమిలీ ఎన్నికలు ఉండవచ్చనేది అత్యధికులు నమ్ముతున్న అంశం. ఆ దిశగానే బీజేపీ వ్యవహారాలు ముందుకెళ్తున్నాయి.