భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పెద్ద పజిల్ అయిపోయింది. కూటమి కట్టిన విపక్షాలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత కలిసి.. బీజేపీని యూపీ నుంచి ఊడ్చేసేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి కొన్ని రోజులుగా… ఉత్తరప్రదేశ్‌పై కసరత్తు చేస్తోంది. అనేక మార్గాలను.. అన్వేషించింది. అందులో ఒకటి మళ్లీ రాముడ్ని తెరమీదకు తేవడం అన్న ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో క్లారిటీ వస్తోంది.
భారతీయ జనతా పార్టీలో స్థిరంగా ఉన్న ఏకైక ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. కరుడు గట్టిన బీజేపీ హిందూత్వ నేతలు ముస్లిలంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఆయన స్పందించరు. యూపీలో కానీ .. కర్ణాటకలో కానీ… ఒక్క ముస్లిం అభ్యర్థికి టిక్కెట్టివ్వకపోయినా.. తన వాయిస్ వినిపించరు. ప్రస్తుతం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆయన హఠాత్తుగా.. రామమందిరం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ‘రామ మందిరం’ అంశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని ప్రత్యేకంగా ప్రకటించారు. దీన్ని బీజేపీ అనుకూల మీడియా కాస్త విస్త్రతంగా ప్రచారం చేసింది. వెంటనే ఆ బీజేపీ నేతలు.. ఖండన ప్రకటనలు జారీ చేశారు. ఎన్నికల్లో రామ మందిరం అంశం కచ్చితంగా ప్రాధాన్యతాంశమేనని వినయ్ కతియార్ ఆవేశపడ్డారు. అంతే కాదు.. రామమందిరం నిర్మించకపోతేనే.. బీజేపీ ఇబ్బంది అని ప్రకటించేశారు.
దీనిపై ఆరెస్సెస్ కూడా వెంటనే స్పందించింది. వినయ్ కతియార్ అభిప్రాయాలను సమర్థించింది.’రాముడు పుట్టిన ప్రాతంలో రామాలయం కట్టాలని హిందూ సమాజం, సాధవులు, ప్రతి ఒక్కరూ కొరుకుంటున్నారని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది. సుబ్రహ్మణ్యస్వామి కూడా వెంటనే రంగంలోకి దిగారు. అయోధ్య ఆలయంపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడికి పార్టీకి వ్యతిరేకమేనన్నారు.
అంటే ఈ మొత్తం వ్యవహారంలో.. రామాలయం గురించి ప్రస్తావించింది బీజేపీ నేతలే.. దానిని ఖండించింది.. ఆవేశ పూరిత పూరిత ప్రకటనలు చేసిందీ బీజేపీ నేతలే. దానికి సమర్థింపుగా ఆరెస్సెస్ మరింత మంట రాజేసే ప్రయత్నం చేసింది. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తి మెజార్టీ వస్తే..రామాలయం కడతామని చెప్పుకొచ్చిన బీజేపీ… నాలుగేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకుపోయింది. యూపీలో, కేంద్రంలో ఆ పార్టీ కమాండింగ్ పొజిషన్లో ఉన్నా లైట్ తీసుకుంది. ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే సరికి మళ్లీ తెరమీదకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.! హే..రామ్.. అంతే..!!