ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిర్ణయించుకోవడంతో… భారతీయ జనతా పార్టీకి మళ్లీ గొప్ప అవకాశం లభించినట్లయింది. ఆ పార్టీకి నలుగురు శాసనసభ్యులు ఉన్నారు. సభలో వైసీపీ లేని లోటును తీర్చాల్సి ఉంది. నిన్నామొన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు.. టీడీపీని ధీటుగా ఎదుర్కొని ప్రజల దృష్టిలో పడాలనుకుంటోంది. కానీ అధికార పార్టీ అంతకు మించిన వ్యూహంతో ఉంది. ఆ పార్టీ వైసీపీని టార్గెట్ చేయాలనుకోవడం లేదు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే.. దోషిగా ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది.
గత అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం , ప్రత్యేక హోదా , ఆర్ధిక లోటు విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి అంశాలపై కేంద్రం వైఖరిని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సారి సమావేశాల్లో పెట్రోధరల పెంపు, పెద్దనోట్లు రద్దు వంటి నిర్ణయాలతో ప్రజలపై పడిన భారాన్ని.. అదంతా మోడీ చేతకాని తనమేనని.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించనున్నారు. పీడీ అకౌంట్ల విషయాన్ని బీజేపీ లేవనెత్తాలని.. టీడీపీ కోరుకుంటోంది. అసలు బీజేపీ బండారం సభలో బయటపెట్టాలని కోరుకుంటోంది. బీజేపీ కూడా.. ఏపీ ప్రభుత్వంపై ప్రధానంగా అవినీతి ఆరోపణలతోనే దాడి చేయడానికి సిద్ధమయిది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం… సంబంధం లేని కారణాలతో అసెంబ్లీకి డుమ్మా కొడుతోంది. ప్రజల్లో బ్యాడ్ ఇమేజ్ వస్తున్నా.. జగన్ మాత్రం తన నిర్ణయం మార్చుకోవడం లేదు. ఈ పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేయనుంది. అయితే బీజేపీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో విష్ణుకుమార్ రాజు మినహా గట్టిగా మాట్లాడేవారు లేరు. విష్ణుకుమార్ రాజు కూడా.. ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తారో.. ఎప్పుడు పొగుడుతారో.. బీజేపీ ఎమ్మెల్యేలకే తెలియదు. ఆయనపై పార్టీ మార్పు రూమర్లు కూడా ఉన్నాయి. ఇక మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.. నోరు ఎత్తే అవకాశం లేదు. ఆకుల సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు.. ప్రభుత్వంపై ఎంత మేర ఎటాక్ చేస్తారన్నది.. ఆసక్తికరంగా మారింది.