ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలకు స్టీల్ ప్లాంట్ సెగ బాగానే తగులుతోంది. రగులుతున్న ప్రజా ఉద్యమం… పెరుగుతున్న సెంటిమెంట్ కారణంగా కేంద్ర నిర్ణయాన్ని ఆమోదించే పరిస్థితి లేదు. సుజనా చౌదరి చెప్పినట్లుగా అమ్మకం ఖాయం అని తేల్చిచెప్పడం రివర్స్ అయింది. దీంతో ప్రజల్లో తిరగాల్సిన తాము అలా చెప్పకూడదని డిసైడయ్యారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో .. ఏపీ బీజేపీ కీలక నేతలందరూ సమావేశమయ్యారు. ముఖ్యంగా విశాఖ ప్రాంత నేతలు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ముందుగా మరో మాట లేకుండా వ్యతిరేకించాలని నిర్ణయించారు.
అయితే అదే సమయంలో కేంద్ర నిర్ణయానికి తిరుగుబాటు అన్నట్లుగా కాకుండా.. సుతిమెత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. పధ్నాలుగో తేదీన అందరం కలిసి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. విశాఖ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. 100 శాతం ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలనే నిర్ణయానికి ఖచ్చితంగా వ్యతిరేకమని ఎమ్మెల్సీ మాధవ్ చెబుతున్నారు. రాజీనామాలపై స్పందించను.. మా పార్టీ స్టాండ్ మాకు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. నిజానికి రాజీనామా చేయడానికి ఆ పార్టీలో ఎవరికీ పెద్దగా పదవుల్లేవు.
సోము వీర్రాజు, మాధవ్ మాత్రమే ఎమ్మెల్సీలుగా ఉన్నారు. సోము పదవి త్వరలో ముగిసిపోతుంది. మాధవ్ పదవి మాత్రం మరికొన్నాళ్లు ఉంటుంది. రాజీనామా చేస్తే మళ్లీ బీజేపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అందుకే బీజేపీ నేతలు.. అమరావతికి మద్దతు ఇచ్చినట్లుగానే… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలన్న నిర్ణయానికి వచ్చారు. అంటే… ఓ వైపు సహకారం.. రాజకీయ పరంగా ప్రజల సెంటిమెంట్లకు అనుకూలంగా రాజకీయం చేయడం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నేతలు దానికే ఫిక్సయ్యారు.