ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర… కొన్ని నెలల కిందట దీనికి సంబంధించి బీమా కోరేగావ్ ఘటన సందర్భంగా తెరమీదికి వచ్చిన కోణం ఇది. రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారంటూ ఆ సందర్భంగా జరిగిన సోదాల్లో ఓ ఉత్తరం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కుట్రకు సంబంధించిన ఆర్థిక అవసరాలన్నీ వరవరరావు సమకూర్చుతున్నారనేది దాన్లో ఉందన్నారు. ఇదే అంశమై పూణె పోలీసులు వరవరరావును హైదరాబాద్ లో అరెస్టు చేశారు.
ఢిల్లీ, ఫరీదాబాద్, గోవా, ముంబై, రాంచీ, హైదరాబాద్ లలో 9 మంది యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేసి ఐదుగుర్ని అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టులపై నిరసన కూడా తీవ్రస్థాయిలో వ్యక్తమౌతూ ఉండటం విశేషం! ఒక ఉత్తరం దొరికిందన్న ఆ ఆధారంతోనే ఇలా అరెస్టులు చేయడం సరికాదని కొంతమంది అంటున్నారు. రామచంద్ర గుహ, ప్రశాంత్ భూషణ్, అరుంధతీ రాయ్ వంటివారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే, సరైన ఆధారాలు తమ దగ్గర ఉండబట్టే అరెస్టులు చేశామని పోలీసులు అంటున్నారు. ప్రధాని హత్యకు వీరంతా కుట్ర పన్నారని చెబుతున్నారు.
ఈ అరెస్టుల నేపథ్యంలో రాజకీయ కోణంలో కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు ప్రముఖ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ మధ్య భాజపా గ్రాఫ్ బాగా పడిపోతోందని సర్వేలున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం మావోయిస్టు ప్రభావితం రాష్ట్రం, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందనీ, అయినా సమర్థంగా ఎదుర్కొంటున్నానంటూ మోడీ ప్రచారం చేసుకోవాలన్న వ్యూహం అరెస్టులు వెనక ఉందనే అభిప్రాయం కూడా ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. సానుభూతిని గెయిన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే కోణం కూడా ఉందనే విశ్లేషణలూ ఉన్నాయి. ఇది మూడు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంలో భాగమనేవారూ ఉన్నారు.
వరవరరావు మొదట్నుంచీ సాహిత్యపరంగా ఎక్కువగా వామపక్ష భావజాలాన్ని వినిపిస్తూ వచ్చారు. మేధావిగా రచయితగా గుర్తింపు ఉంది. అయితే, ఇలా కుట్రలకు సొమ్మును సమకూర్చారనే ఆరోపణలు గతంలో ఎన్నడూ లేవు. ఏకంగా ప్రధానమంత్రి హత్య కుట్రకు సంబంధించి కోట్ల నిధులు ఆయన ద్వారా వెళ్లాయనడంలో నిజానిజాలు ఎంతో ఇంకా తేలాల్సి ఉంది. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా.. అలాంటి కుట్ర అంటూ జరిగితే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే.