ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వినాయకుడి పండుగ చేసుకుంటామంటూ ఆందోళనలు ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తోందంటూ సోము వీర్రాజు నేతృత్వంలో కొంత మంది కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే బహిరంగ మండపాలకు అనుమతి లేదన్నమాట. ఇలా చేయడం సరి కాదని.. వైఎస్ జయంతి, వర్థంతిలకు లేని ఆంక్షలు వినాయక చవితికే ఎందుకని బీజేపీ నేతలు ఆందోళనలు ప్రారంభించారు. ప్రభుత్వం ఆంక్షలు ఉపసంహరించుకోవాలన్నారు.
ఎక్కడా లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు పెడుతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ టాపిక్ బీజేపీకి ఆసక్తికరంగా ఉండటంతో బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే బీజేపీ నేతలు ఆలస్యం చేశారని ఇప్పటికే పండుగ సమయం దగ్గర పడిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మూడు రోజుల ముందుగా ఆందోళనలు చేస్తే ఎవరు పట్టించుకుంటారని అంటున్నారు. అయితే బీజేపే నేతలు ఎక్కడిక్కకడ ఆందోళనలు చేద్దామనుకున్నా కార్యకర్తల బలం లేదు. అందుకే బలం ఉన్నచోటకు వెళ్లి కార్యకర్తర్ని సమీకరించుకుని ముట్టడికి ప్రయత్నిస్తున్నారు.
కర్నూలులో కొంత మేరు బైరెడ్డి అనుచరులు ఉండటంతో వారి సాయంతో ఆందోళనలు చేశారు.ఇతర చోట్ల పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా ఓ వైపు ప్రజాసమస్యలపై తమ మిత్రపక్షం జనసేన పోరాడుతూంటే బీజేపీ మాత్రం కోవిడ్ నిబంధనలు ఉన్నా వినాయకచవితి వేడులకు అనుమతి ఇవ్వాలని టాపిక్‌ను రాజకీయ పోరాటానికి ఎంచుకోవడం ఏమిటన్న విమర్శలు సహజంగానే ఇతరుల నుంచి వస్తున్నాయి.