అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. బయటకు రావడానికి తంటాలు పడ్డాడు. అది పురాణం. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీ వ్యూహంలో చిక్కుకున్నారు. నిర్వీర్యం అయిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితి. బయటకు వస్తే నిలకడ లేదని ప్రచారం చేస్తారు. బయటకు రాకపోతే… బీజేపీ నిర్వీర్యం చేసేస్తుంది. ఏం చేయాలో తెలియక ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ నడి సంద్రంలో మిగిలిపోయారు.
పవన్ నిస్సహాయుడన్న ముద్ర వేస్తున్న బీజేపీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడం ఒకటి అయితే.. కేంద్రం వాటికి సపోర్ట్ చేస్తూ.. రాష్ట్రాన్ని మరింతగా అధం పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాలన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజల్లో ఆవేదన గూడుకట్టుకుంటూనే ఉంది. ప్రజా ఆవేదన చూసి.. ఆవేశంతో ఊగిపోయే పవన్ కల్యాణ్… ఇప్పుడు కంట్రోల్ కంట్రోల్ అనుకుంటున్నారు. దీనికి కారణం .. ఆయన బీజేపీతో పొత్తులో ఉండటం. ఏపీలో ఈ దుస్థితి వెనుక బీజేపీ ఉండటం. మిత్రపక్షాన్ని విమర్శించలేక.. వారి నిర్ణయాలను ఖండించలేక పవన్ కల్యాణ్ నోరు తెరకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు. దీంతో ఆయన నిస్సహాయుడన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతోంది. ఇది నిఖార్సుగా బీజేపీ వేస్తున్న ముద్ర. ఆయన ప్రజల కోసం ఏమీ చేయరని.. ధైర్యం లేదన్న ముద్రను బీజేపీ వ్యూహాత్మకంగా వేస్తోంది.
పవన్ పోరాటాలపై ప్రజల్లో అనుమానాలు..!
అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు…హడావుడిగా పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని… ఆ మేరకు షరతు పెట్టి మరీ పొత్తు పెట్టుకున్నట్లుగా పవన్ కల్యాణ్ .. రాజధాని రైతులకు చెప్పారు. కానీ ఆ తర్వాత రాజధాని రైతులకు మద్దతే కరవయింది. అటు బీజేపీ వాళ్లు పట్టించుకోలేదు.. ఇటు జనసేన నేతలు కూడా పట్టించుకోలేదు. విష్ణువర్ధన్ రెడ్డిలాంటి బీజేపీ నేతలు… రాజధాని రైతులపై దారుణమైన వ్యాఖ్యలు చేసినా జనసేన నేతలు పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ ఖండించలేదు. చివరికి.. రైతులకు సంఘిభావం చెప్పడం కూడా గగనమైపోయింది. అప్పుడప్పుడ్ ప్రెస్నోట్లు మాత్రం వస్తున్నాయి. ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా.. నిర్ణయం తీసుకున్నాక చూద్దామని.. ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు పవన్. దీంతో రాజధాని రైతులు ఉసూరుమన్నారు. ఇదంతా బీజేపీతో పొత్తు వల్లే జరిగింది. బీజేపీతో పొత్తు లేకపోతే.. స్వేచ్చగా ఆయన రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేవారు. కానీ బీజేపీ విధానం డొంక తిరుగుడు కాబట్టి.. అలాే ఉంటున్నారు. ప్రజల్లో ఇమేజ్ తగ్గించుకుంటున్నారు.
స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పవన్ ని విలన్‌ను చేసిన బీజేపీ..!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ఆవేశపడ్డారు. కానీ ఇప్పుడు..కార్మికుల ఉద్యమానికి కూడా మద్దతు పలకడం లేదు. బంద్ పాటిస్తే.. ఒక్క సారి కూడా పిలుపు ఇవ్వలేదు. పైగా.. ఒక్క స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదని.. దేశం మొత్తం అమ్ముతున్నారన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ విధానం. తన వాయిస్ ద్వారా బీజేపీ విధానాన్ని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ గ్రిప్‌లో ఉన్నారని.. ఆయన నమ్మదగ్గ నేత కాదన్న ముద్ర ప్రజల్లో పడిపోతోంది. ఇదంతా వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు చేస్తున్నారు.
కాస్త తరచి చూస్తే ఇదంతా బీజేపీ వ్యూహం. పవన్ కల్యాణ్‌ను నిర్వీర్యం చేసే వ్యూహం. ఈ ట్రాప్‌లో పవన్ పడిపోయారు. వ్యూహంలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు దాన్నుంచి బయటకు రావాల్సింది ఆయనే.