తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకూ యూజ్ అండ్ త్రో పాలసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబునాయుడు పేరు చెప్తూ ఉంటారు. ఎవ్వరినైనా సరే అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాత నిర్ధాక్షిణ్యంగా వదిలేయడం బాబుకు బాగా అలవాటని ఎంతమంది నాయకులు ఎన్నిరకాలుగా బాబును విమర్శించారో లెక్కేలేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచీ జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఎన్నో ఉదాహరణలను కూడా ఆ విమర్శకులు చూపిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా మాత్రం బాబునే వేరేవాళ్ళు వాడుకుంటూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, అలాగే రాజ్యసభలో కీలక బిల్లులు పాస్ అవ్వడం కోసం చంద్రబాబును వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు కూడా హ్యాపీనే. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబే నరేంద్రమోడీకి కాస్త ఎక్కువ ఉపయోగపడ్డాడని ఆయన అనుకూల మీడియాతో సహా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాకి మైనారిటీల ఓట్లను నమ్ముకుని ఉన్న పార్టీలన్నీ కూడా బిజెపికి హ్యాండ్ ఇచ్చాయి. నరేంద్రమోడీని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాయి. అయితే అంతకుముందు అదే మైనారిటీ పాలిటిక్స్‌లో భాగంగా మోడీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తానన్న చంద్రబాబు…..2014ఎన్నికల సమయంలో మాత్రం వెంకయ్యనాయుడుతో సహా వేరే ఎవ్వరికీ తీసిపోని స్థాయిలో మోడీని పొగిడేశాడు. అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్లతో సహా ఏ ఒక్కటీ కూడా కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. అయినప్పటికీ రాజధాని శంకుస్థాపనకు మోడీ అమరావతికి వచ్చినప్పుడు తన శక్తిమేరకు మోడీని ప్రశంసించాడు చంద్రబాబు. అలాగే బిజెపి ప్రభుత్వం ఎన్నికలలో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో కాస్త ఎక్కువ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్న ప్రతిచోటా టిడిపి సహాయాన్ని తీసుకుంటున్నారు బిజెపి వాళ్ళు.
నోట్ల రద్దు నిర్ణయం వళ్ళ అనుకున్న ఫలితం ఉంటుందా? ఉండదా? అనే విషయం భవిష్యత్ చెప్పాలి. కానీ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో మాత్రం మోడీ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడన్నది కంటికి కనిపిస్తున్న వాస్తవం. కనీస అక్షరాస్యతకు కూడా నోచుకోని జనాలు, బ్యాంక్ సేవలకు కడు దూరంలో ఉండే జనాల కష్టాలు అయితే వర్ణనాతీతం. పోతున్న ప్రాణాల లెక్క కూడా రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అని మన చట్టం చెప్తుంది. కానీ ఒక్క నోట్ల రద్దు నిర్ణయం వళ్ళ పదుల సంఖ్యలో నిర్దోషులు చనిపోతూ ఉన్నారు. ప్రజాగ్రహం మొత్తం మోడీ వైపు మళ్ళుతుందన్న ఉద్ధేశ్యంతో పాపాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అకౌంట్లో, బ్యాంక్ ఎంప్లాయిూస్ అకౌంట్లో వెయ్యాలని చూశారు. కానీ అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే ముఖ్యమంత్రుల కమిటీ అని ‘కమిటీ పాలిటిక్స్’కి తెరలేపారు. ఓ వైపు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కమ్యూనిస్టులతో పాటు దేశం మొత్తం మీద కూడా ఎంతో కొంత పేరున్న నాయకులు రెచ్చిపోయి విమర్శలు చేస్తూ ఉండడంతో ఈ కమిటీకి కూడా ఆ స్థాయి నాయకుడినే ఛీఫ్‌గా నియమించాల్సిన పరిస్థితి. నోట్ల రద్దును సమర్ధించిన నితీష్ కుమార్ కూడా ఈ విషయంలో బిజెపికి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఆప్షన్ అంటూ మోడీకి ఎవ్వరూ లేరు. దేశం మొత్తం మీద కూడా చంద్రబాబుకు ఎంతో కొంత పేరుంది. ముఖ్యంగా నేషనల్ మీడియాకు బాగా పరిచయమున్న నేత చంద్రబాబు. ఈ కమిటీ స్టంట్ కచ్చితంగా బిజెపికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి విషయాలను మేనేజ్ చేయగల సత్తా చంద్రబాబుకు ఉంది.
బిజెపికి చంద్రబాబు బాగానే ఉపయోగపడుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే చంద్రబాబును బిజెపివాళ్ళు బాగానే వాడుకుంటున్నారు. మరి చంద్రబాబుకేంటి? అనుకూల మీడియా సర్వేలు ఎలా ఉన్నా రుణమాఫీతో పాటు తాను ఇచ్చిన హామలన్నింటి విషయంలోనూ చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయాడు. దానికితోడు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం, ఆర్థికలోటు భర్తీ లాంటి హామీలేవీ కూడా నెరవేరడం లేదు. ఆపత్కాలంలో తమకు సపోర్ట్‌గా నిలబడుతున్న చంద్రబాబుకు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి మోడీవారు ఈ సారైనా కాస్త ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తారా? న్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సిన వాటిని అయినా ఇస్తారా? కనీసం ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అయినా కల్పిస్తారా? లేకపోతే యూజ్ అండ్ త్రో పాలసీని బాబుకే రుచి చూపిస్తారా?