దేశమంతా ఒక తీరుగా ఉంటే… ఆంధ్రాలో మాత్రం ఆ పార్టీది మరో తీరు! ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుని భాజపా అధికారం చేజిక్కించుకుంటోంది. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి దేశాన్ని కాషాయమయం చేయడమే కంకణంగా కట్టుకుంది! కానీ… కానీ… కానీ… ఆంధ్రా విషయంలో భాజపా ఎందుకో పట్టు కోసం ప్రయత్నించడం లేదు. అలాగని నిర్లిప్తంగా ఉన్నా కొంత బాగుండేది. విచిత్రంగా రివర్స్ లో కాషాయమే కలర్ మార్చుకుంటున్నట్టుగా ఉంది! ఏపీ టీడీపీలో భాజపా పరిపూర్ణంగా విలీనం అయ్యే దశలో ఉందనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ వేడుకలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెళ్లారు! ఆ వేడుకలు ఎక్కడో రవీంధ్ర భారతిలో జరిగినా, లేదా ఏ లలిత కళాతోరణంలో జరిగినా ఆయన అతిథిగా వెళ్తే ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకీ ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరమూ లేదు. ఆంధ్రాలో పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ చంద్రబాబును వెనకేసుకొచ్చేంత స్నేహాన్ని వెంకయ్య ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు అంతకుమించిన స్నేహ ధర్మాన్ని ప్రదర్శించారు. ఆయనే సొంతంగా తెలుగుదేశం ఆఫీస్ కి వెళ్లి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి వెంకయ్య పువ్వులు అర్పిస్తున్న ఓ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ ఒక లెజెండ్ కాబట్టి ఆయనకి వెంకయ్య నివాళులు అర్పించడం తప్పు పట్టాల్సిన విషయం కాదు. ఏపీ భాజపా వర్గాలు కూడా దీన్ని ప్రత్యేకంగా చూడటం లేదు. అయితే, కేవలం వెంకయ్య తీరుపై కొన్ని వ్యాఖ్యానాలు మొదలైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన టీడీపీ ఆఫీస్ కి వెళ్లడమే ఇప్పుడు ఏపీ భాజపాలో కూడా లోలోప చర్చకు కారణమౌతున్నట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిపితే.. ఈ రేంజిలో చంద్రబాబు వస్తారా, భాజపా నేతలతో ఈ స్థాయిలో కలిసిపోగలరా అనే ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
మొత్తానికి, ఏపీలో భాజపా విస్తరించే అవకాశాలు దాదాపు మృగ్యం! దేశమంతా భాజపా హవా కొనసాగించగలదేమోగానీ, ఏపీలో మాత్రం సాధ్యం కాదనేది రానురానూ మరింత స్పష్టమౌతోంది. ఈ ప్రత్యేక పరిస్థితిపై భాజపాలో చర్చ జరుగుతోందా లేదా..? సంఘ్ పరివార్ లో వెంకయ్య తీరుని ఎవరైనా గమనిస్తున్నారా లేదా..? ఆంధ్రా విషయంలో భాజపాకి ఏమైందీ..? ఆశలు వదిలేసుకున్నట్టా… చేజేతులా బలి చేసుకుంటున్నట్టా..?