తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఇప్పుడు గేమ్ చేంజర్‌గా మారుతోంది. జ్యూడీషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. గతంలో సీబీఐ విచారణ అడిగారు కదా ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరంలో కాస్తంత విచారణ జరిపితే అవినీతి వేల కోట్లలో బయటకు వస్తుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. బీజేపీ కూడా మొదటి నుంచి కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ నేరుగా సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో డిమాండ్ చేసినట్లుగా సీబీఐకి సిఫారసు చేయాలని.. రెండు రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు.
కాళేశ్వరంలో కేంద్రం పాత్ర లేదు. రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. కానీ కాళేశ్వరంకు కేంద్రం సహకరించింది. పలు రకాల రూల్స్ ఉల్లంఘించి అనుమతులు, అప్పులు ఇప్పించారు. ఇవన్నీ విచారణలో బయటకు వస్తాయన్న కారణంగానే బీజేపీ సీబీఐ విచారణకు పట్టుబడుతోందని అనుమానిస్తున్నారు.
కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ బీజేపీకి కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. కాళేశ్వరంలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో తమకు పూర్తి సమాచారం ఉందని.. జ్యూడిషియల్ విచారణతో మొత్తం ప్రజల ముందు పెడతామని అంటున్నారు.
మొత్తంగా రెండు పార్టీలు కాళేశ్వరంపై విచారణకు పోటీ పడుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు.. ఎవరు నిజాల్ని బయటపెడతారన్నది సస్పెన్స్ గా మారింది.