భారతీయ జనతా పార్టీ అంటే దేశంలోనే ఇప్పుడు అతి పెద్ద పార్టీ. రాష్ట్రాలకు రాష్ట్రాలు పరిపాలిస్తోంది. కానీ చేసే రాజకీయాలు మాత్రం గల్లీ స్థాయిలోనే ఉంటాయన్న విమర్శలను మాత్రం ఎప్పుడూ వదులుకోదు. తాజాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆ పార్టీ చేస్తున్న రాజకీయం దేశం మొత్తాన్ని ఔరా అనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయడానికి ఏకంగా కేంద్ర కేబినెట్లో కీలకమైన నిర్ణయాన్ని హడావుడిగా తీసుకున్నారు. దీనిపై ఆమ్ ఆద్మీ సహజంగానే విరుచుకుపడుతోంది.
ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ మూడింటిలోనూ బీజేపీనే అధికారంలో ఉంది. అయితే వాటి కాలపరిమితి ముగిసింది. ఎన్నికలు పెట్టాల్సి ఉంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. గత వారం షెడ్యూల్ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా… తాము మున్సిపాలిటీలను విలీనం చేయాలనుకుంటున్నామని.. ఎన్నికలు నిర్వహించదని లేఖ రాసింది. దాంతో ఈసీ కూడా షెడ్యూల్ కూడా ఆపేసింది. తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్లను కలిపివేస్తూ ఒకదానిగా మారుస్తూ కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదింప చేసుకుని ఆ తర్వాత .. దానికి తగ్గట్లుగా విలీన కార్యక్రమాలు పూర్తి చేసి అప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలను ఆలస్యం చేయడానికే ఇలా చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడుతున్నారు. సమయానికి ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించి.. బీజేపీ గెలిస్తే ఆప్‌ను మూసేస్తానని ఆయన సవాల్ చేస్తున్నారు . దీనిపై బీజేపీ సైలెంట్‌గా ఉంది. ఢిల్లీ రాజకీయాలను.. ఢిల్లీ లోకల్‌గానే ఉంచకుండా.. ప్రతీ సారి కేంద్ర ప్రభుత్వం అధికారాలను వినియోగిస్తూండటంతో దేశవ్యాప్త చర్చనీయాంశం అవుతూనే ఉంది. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనే చట్టం కూడా చేసింది.