ఎన్నికల ముందు వరకూ.. భారతీయ జనతా పార్టీకి పేరుకు రహస్య మిత్రపక్ష పార్టీ బీజేపీ. బహిరంగంగా అయితే.. అందరూ ఒప్పుకునే నిజం. ఎన్నికలకు ముందు టీడీపీని చిత్తుగా ఓడించాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు కానీ.. తమతు ఓటు వేయాలని మాత్రం ఎక్కడా అడగలేదు. అంటే.. వారి ఉద్దేశం.. తమకు ఓటు వేయకపోయినా.. వైసీపీని గెలిపించమనే. అలా ప్రచారం చేసిన.. బీజేపీ.. ఇప్పుడు… అదే వైసీపీకి పూర్తి విరోధిగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా.. ఏపీలో జరుగుతున్న పరిణామాలు మాత్రమే కాదు.. దేశం బయట … ఏపీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా.. బీజేపీ అదే తరహా రాజకీయం చేస్తోంది. వైసీపీ వ్యతిరేక శక్తులందర్నీ దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి.. అమెరికాలో జరుగుతున్న తానా సభలపై ఉంది. అక్కడ కూడా.. బీజేపీ నేతలు.. అదే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
అమెరికా కేంద్రంగా వైసీపీ వ్యతిరేకుల ఏకీకరణ..!
ఆంధ్రప్రదేశ్‌లో.. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తానా సభలకు హాజరయ్యారు. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ మాత్రం… బీజేపీ నేతలు.. ఎవరెవరితో కలుస్తున్నారు..? ఏం మాట్లాడుతున్నారు అన్నదే. రామ్‌మాధవ్.. తానా సభలకు అమెరికా వచ్చి.. వేదికపై వచ్చి ప్రసంగించక ముందే.. తన అజెండాను అమలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో.. చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశాన్ని బయట పెట్టడానికి ఇద్దరూ ఇష్టపడలేదు కానీ.. అసలు విషయం మాత్రం.. ఏపీలో రాజకీయమే. జగన్‌కు ఎలా చెక్ పెట్టాలన్నదే. ఇక… టీడీపీ నేతలు..రామ్‌మాధవ్‌తో ఊహించనంతగా.. రాసుకుని.. పూసుకుని తిరుగుతూ కనిపించారు. కారణం ఏదైనా… వైసీపీని ఎదుర్కోవాలంటే… కచ్చితంగా బీజేపీ మద్దతు ఉండాలన్న భావన వారికి ఉండటమే కావొచ్చు. బీజేపీ నేతలు కూడా.. టీడీపీ నేతల్ని.. ఆత్మీయులన్నంత దగ్గర తీసుకున్నారు. ఇక్కడా… వైసీపీ వ్యతిరేక ఈక్వేషనే కనిపిస్తోంది.
బీజేపీ దూరమవుతున్న వైనంతో వైసీపీలో ఆందోళన..!
భారతీయ జనతా పార్టీ.. ..తమకు క్రమంగా దూరమవుతూండటం.. వైసీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. రాజకీయంగా.. అయినా పాలనా పరంగా అయినా బీజేపీ చల్లని చూపు లేకపోతే… వైసీపీ మనుగడ అనేది అసాధ్యమయిన విషయం. ఆ సంగతి.. వైసీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే .. వీలయినంతగా.. అండర్ ప్లే చేస్తున్నారు. ప్రజల కోసం… కొన్ని సార్లు… ప్రత్యేకహోదా గురించి.. ఇతర అంశాల గురించి మాట్లాడినప్పటికీ.. తాము ఎప్పుడూ.. బీజేపీకి అత్యంత విధేయులమని.. అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. వైసీపీ తీరును.. బీజేపీ నమ్మడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఓ వైపు హోదా మంటలు.. మరో వైపు క్రిస్టియన్ కోటరీ.. ఇలాంటి అంశాలతో.. తమతో మంచిగా నటిస్తూ.. టీడీపీ తరహాలో ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయంతో బీజేపీ ఉంది. అందుకే.. దూరం.. దూరం పాటిస్తోంది. ఈ గ్యాప్ పెరిగిపోతే.. పరిణామాలు వేరుగా ఉంటాయని.. వైసీపీలో ఆందోళన ఇప్పుడిప్పుడే ప్రారంభమయింది.
“బీజేపీ- టీడీపీ” మధ్య కొత్త తగవుల కోసం సాక్షి ప్రయత్నాలు అందుకే..!
సాక్షి మీడియా… టీడీపీ- బీజేపీ ఇప్పటికీ.. రహస్య మిత్రులని ఎన్నికల ప్రచార సమయంలో… విస్తృతంగా కథనాలు ప్రచురించింది. ఆ తర్వాత కూడా.. అదే ఒరవడి కొనసాగించింది. అయితే.. ఇప్పుడు మాత్రం.. తన కథనాల శైలిలో మార్పు తెచ్చుకుంది. టీడీపీ – బీజేపీ మధ్య స్నేహం పెరుగుతుందని… అది తమకు ఇబ్బందికరం అవుతుందని అనుకున్నారేమో కానీ.. రెండు పార్టీల మధ్య ..కొత్తగా వివాదాలు పుట్టుకు వచ్చేలా.. కథనాలు ప్రచురిస్తున్నారు. టీడీపీపై.. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే.. బీజేపీపై… టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా.. రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు .. ఏర్పడకుండా.. సాక్షి పత్రిక.. తన ప్రయత్నాలు తాను చేస్తోంది.
మొత్తానికి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి.. గట్టిగా 40 రోజులు కూడా కాక ముందే.. రాజకీయంలో మాత్రం సమూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. దానికి సాక్షి పత్రిక మాత్రమే కాదు.. వైసీపీ నేతల ఆందోళన కూడా సాక్ష్యంగా కనిపిస్తోంది.