హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని చివరి నిమిషంలో బీజేపీ నిర్ణయిచింది. చివరి రోజు అభ్యర్థిని ఖరారు చేసి నామినేషన్ వేయించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయలేదు. మజ్లిస్ కు సహకరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉంది. ఓట్ల ప్రకారం చూస్తే.. మజ్లిస్ కు తిరుగులేని సపోర్టు ఉంది. మరి బీజేపీ ఎందుకు ఈ ఎన్నికను ఇంత సీరియస్ గా తీసుకుందన్నది ఆసక్తికరంగా మారింది.
కేవలం అభ్యర్థిని నిలబెట్టడమే కాదు బీజేపీ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. రాజా సింగ్ అసంతృప్తిగా ఉన్నాడని చెప్పి ఆయనను కలిసి బుజ్జగించింది. పార్టీ ముఖ్యనేతలందర్నీ రంగంలోకి దింపారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు కార్పొరేటర్లను కోరుతున్నారు. గెలిచి చూపిస్తామని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనల వెనుక తెర వెనుక రాజకీయం ఏదో ఉందన్న గట్టి అభిప్రాయం రాజకీయవర్గాలకు కలుగుతోంది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు 110 ఉన్నాయి. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. 3 డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్ల బలం ఉంది. మజ్లిస్ కు అందరూ ఓట్లేస్తారు. అంటే 63 ఓట్లు అవుతాయి. దీంతో మజ్లిస్ కు తిరుగులేని విజయం ఖాయం.
బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ కు బహిష్కరించింది. ఆ పార్టీకి 25 ఓట్లు ఉన్నాయి. విప్ ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఒకవేళ అంతర్గత ఒప్పందం ఏదైనా జరిగి ఉంటే.. బీఆర్ఎస్ కు చెందిన పాతిక ముంది బీజేపీకి ఓటేసినా బీజేపీ గెలవదు. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న ఓట్లు 19. మాత్రమే. గెలవాలంటే ఖచ్చితంగా మజ్లిస్ , కాంగ్రెస్ సభ్యులను చీల్చాలి. మజ్లిస్ కార్పొరేటర్లు బీజేపీ వైపు వచ్చే చాన్స్ ఉండదు. కాంగ్రెస్ ఓటర్లందర్నీ చీల్చడం సాధ్యం కాకపోవచ్చు. మరి బీజేపీ ఏ ఉద్దేశంతో గెలుస్తామని చెబుతుందో ?