పాదయాత్ర ఆపేసి మరీ రెండు రోజుల పాటు షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు, ఏడు తేదీల్లో ఆమె ఢిల్లీలో ఉంటారు. బీజేపీ పెద్దలతో భేటీ అవుతారని .. వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత వరకూ ఆమెకు ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఎక్కడా భారతీయ జనతా పార్టీతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు రాలేదు. కానీ హఠాత్తుగా ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇందులో కొన్ని బహిరంగ సమావేశాలుంటాయి కానీ అంతర్గత చర్చలు ఎక్కువగా జరుగుతాయని తెలుస్తోంది.
తెలంగాణ విషయంలో షర్మిల కష్టపడి.. ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. ప్రజల్లో కనీసం చర్చ జరగడం లేదు. కనీసం ఆమె పార్టీని ఓ కాంపిటీటర్‌గా కూడా చూడటం లేదు. ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఇలాంటి పార్టీల వల్ల సమస్యలు వస్తాయని అనుకుంటోంది. అందుకే వ్యూహాత్మకంగా ఆయా పార్టీలను లైన్ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది. షర్మిల విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని.. ఢిల్లీలో ఆమెకు బీ జేపీ వ్యూహకర్తలు కొన్ని ప్రతిపాదనలు పెడతారుని చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో ఏపీలో జరగనున్న పరిణామాలను వివరించి.. ఏపీలో మంచి భవిష్యత్ ఉంటుందని.. అక్కడే తేల్చుకోవాలని ఆమెకు ఢిల్లీ బీజేపీ పెద్దలు సలహా ఇస్తారని అంటున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల సోదరుడితో షర్మిలకు పూర్తి స్థాయి దూరం పెరిగింది. హెల్త్ వర్శిటీ పేరు మార్పును కూడా ఖండించారు. కుటుంబ పరంగా ఆస్తుల పంపకాల్లోనూ విభేదాలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. అన్నింటికీ మించి షర్మిల రాజకీయంగా షైన్ అవ్వాలనుకుంటున్నారు.
అయితే వైసీపీలో ఆమెకు చోటు ఉండదు. సొంత పార్టీ పెట్టుకోవాల్సిందే. తెలంగాణలో ఏ మాత్రం వర్కవుట్ అవదని తేలిన తర్వాత షర్మిల ఖచ్చితంగా ఏపీ వైపు చూస్తారని.. అది ఎప్పుడో కాదు.. ఇప్పుడే ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది.