విపత్తును కూడా విమర్శలకు వాడుకునే రాజకీయ సంస్కృతి ఎక్కడా చూడం..! వీలైతే సహాయక చర్యల్లో మనవంతుగా ఏదైనా చేద్దామన్న ఆలోచన వదిలేసి, ఏ సందు దొరుకుతుందా… ప్రభుత్వాన్ని విమర్శించి పడేద్దామా అని కాపుగాసుకుని కూర్చునే కొంతమంది నాయకుల తీరుని ఏమనాలి..? ఈ మధ్య కొన్నాళ్లపాటు మీడియా మైకులకు దూరంగా వచ్చిన భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు… ట్విట్టర్ ద్వారా విమర్శలను పునః ప్రారంభించారు. సరే, ఆయనేదో ఆంధ్రాలో అవినీతీ కుంభకోణాలు అంటూ ఆరోపిస్తే… అలవాటైపోయింది కాబట్టి, ఎవ్వరూ పట్టించుకోరుగానీ, ఇప్పుడు పెథాయ్ తుఫాను పేరుతో రాజకీయానికి దిగడం దారుణం! ఇప్పుడూ ఆయన టార్గెట్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లొచ్చారు ముఖ్యమంత్రి. అయితే, పెథాయ్ తుఫాను సహాయక చర్యలను ఆయన అనుక్షణం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సహాయ చర్యలను మంత్రి నారా లోకేష్ తోపాటు ఇతర శాఖల మంత్రులు కూడా పర్యవేక్షించారు. సాయంత్రానికే చంద్రబాబు మళ్లీ లైన్లోకి వచ్చేసి… అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈలోగానే జీవీఎల్ విమర్శ ఏంటంటే… ఓపక్క రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టిస్తుంటే, జైపూర్ భోపాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారాలకు చంద్రబాబు వెళ్లడమేంటని తప్పుబట్టారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఉందనీ, మిమ్మల్ని భరించడానికి ఆంధ్రులు రోమన్లు కాదు, మీరు చక్రవర్తి కాదంటూ ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
వాస్తవానికి రాష్ట్రంలో సహాయక చర్యలన్నీ జరుగుతున్నాయి. చూసుకోవడానికి మంత్రి వర్గం, ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు కదా! ముఖ్యమంత్రి ఇక్కడ లేనిది కొన్ని గంటలు మాత్రమే కదా! అలాగని ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా తెలుసుకోకుండానే ఉండలేదు. ఈ మాత్రానికే ఇంత పెద్ద విమర్శలు చేసెయ్యాలా..? ఈ విమర్శలు చేసిన సదరు ఎంపీగానీ, ఆ పార్టీగానీ ఇప్పటికిప్పుడు తుఫాను సహాయక చర్యలపై వీలైతే రాష్ట్రానికి సాయం చేద్దామనే ఆలోచనే ఉండదా..? సందర్భం ఏదైనా సరే.. రాజకీయానికి వాడేయమనేనా..? తెలంగాణతోపాటు మూడు ప్రముఖ రాష్ట్రాల్లో భాజపాకి ఓటమి ఎదురయ్యేసరికి, ఈ మధ్య కొన్నాళ్లపాటు విమర్శలకు కాస్త విరామం ఇచ్చినట్టున్నారు జీవీఎల్. ఇప్పుడు తుఫాను పేరుతో మళ్లీ మొదలుపెట్టేశారు. ఇంకేం, భాజపాని అనుసరిస్తూ.. విపక్షమూ సిద్ధమైపోతుంది. సో… విపక్షాలకు విపత్తు ఒక రాజకీయాంశంగా మరోసారి మారిపోయింది. నిన్నమొన్నటి వరకూ తిత్లీ తుఫాను పేరుతో విమర్శిస్తూ వచ్చినవారు… ఇప్పుడు పెథాయ్ పేరుతో మళ్లీ రెడీ అయిపోతారు. ఈ సందర్భంలో కూడా రాజకీయమేనా..?