మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు మొదలవడంతో, శివసేన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నుండి తన మంత్రులను వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటానని హెచ్చరించింది. అయితే తరువాత మళ్ళీ చల్లబడింది. కానీ ఏదో ఒక సాకుతో నిత్యం తమను బెదిరిస్తున్న శివసేనకు బుద్ధి చెప్పేందుకు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
మహారాష్ట్రలో బీజేపీ శివసేన పార్టీల తరువాత మూడవ అతిపెద్ద పార్టీ ఎన్.సి.పి. దాని అధ్యక్షుడు శరద్ పవార్. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఒక అవినీతిపరుడని, ఎన్.సి.పి. ఒక అవినీతి పార్టీ అని, దానిని జిల్లా నుండి తరిమికొట్టి దాని గుప్పిట్లో నుంచి బారామతి ప్రజలు బయటపడాలని కోరారు.
ఒకవేళ శివసేన ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించదలచుకొంటే అప్పుడు అదే అవినీతిపరుడు నడిపిస్తున్న అవినీతి పార్టీ మద్దతు అవసరం ఉంటుంది. కనుక ఆయన పట్ల బీజేపీ నేతల ఆలోచన సరళిలో కూడా అకస్మాత్తుగా మార్పు వచ్చింది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిన్న బారామతిలో ఆయన ఇంటికి వెళ్లి సుమారు ఏడెనిమిది గంటలు గడిపారు. వారిరువురూ కలిసి కొన్న అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అరుణ్ జైట్లీ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.
శరద్ పవార్ గత నాలుగు దశాబ్దాలుగా చేసిన నిరంతర కృషి వలన బారామతి ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలో అటువంటి 100 అభివృద్ధి చెందిన ప్రాంతాలున్నట్లయితే దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. దేశాభివృద్ధి కోసం మహారాష్ట్ర స్ట్రాంగ్ మ్యాన్ శరద్ పవార్ సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు తమకు చాలా అవసరమని అన్నారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ బారామతి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇంచుమించు అరుణ్ జైట్లీలాగే శరద్ పవార్ ని తెగ పొగిడారు. ఎన్నికల ప్రచారంలో చేసుకొన్న విమర్శలు, ప్రతివిమర్శలని ఎన్నికల వరకే పరిమితమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ ఇరువురూ శరద్ పవార్ ని మళ్ళీ ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తద్వారా వారు శివసేనకు ఒక గట్టి హెచ్చరిక పంపే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చును. ఒకవేళ శివసేన మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోదలిస్తే తమకు ఎన్.సి.పి. నుండి మద్దతు పొందగలమని సూచిస్తున్నట్లుంది. బహుశః అందుకే శివసేన చల్లబడిపోయినట్లుంది. త్వరలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి తమ ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొనేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.