తెలంగాణ విమోచన దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. భారీ సభను నిర్వహించాలనీ, జాతీయ పండుగ చేస్తామని భాజపా నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. ఇదే అంశంపై ఇప్పుడు ప్రజల్లో చర్చ జరగాలన్న ఉద్దేశంతో భాజపా నేతలు వరుసబెట్టి మాట్లాడారు. ఓ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ… తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. ఆగస్టు 15న ఇక్కడ స్వతంత్రం రాలేదనీ, ఈ ప్రాంతం నిజాం కి బంధీగా ఉందన్నారు. అందుకే, 17 సెప్టెంబర్ ను అధికారికంగా జరపాలని అధ్యక్షుడు అమిత్ షాకి చెబితే, ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకుని, ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందనే పూర్తి భరోసా కల్పించారని లక్ష్మణ్ చెప్పారు.
పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్రకారులకు చోటులేదనీ, ఉద్యమకారుల గురించి స్థానం లేదనీ, త్యాగాలు చేసిన వారి ఊసే ఎక్కడా లేకుండా చేశారని సీఎం కేసీఆర్ ని విమర్శించారు లక్ష్మణ్. ఇవాళ్ల రాష్ట్రంలో కొత్తగా కల్వకుంట్ల చరిత్రను చూస్తున్నామనీ, ఆ ఒక్క కుటుంబ చరిత్రనే భావితరాలకు అందించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పవిత్రమైన యాదగిరిగుట్లలో సీఎం కేసీఆర్ శిల్పాలు చెక్కించుకున వైనం చూస్తున్నామన్నారు. ఆ తరువాత, మురళీధర్ రావు మాట్లాడుతూ… ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటుగానీ, అలాంటి సెప్టెంబర్ 17ని ఎందుకు అధికారికంగా నిర్వహించలేకపోయారని ప్రశ్నించారు. ముస్లిం ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే న్యూనతాభావంతో వారున్నారన్నారు. ఆ తరువాత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రజాకారుల ఘటన గురించి సవివరంగా మాట్లాడారు.
సెప్టెంబర్ 17ని తెలంగాణ స్వాతంత్ర్య దినంగా ఘనంగా నిర్వహించాలని భాజపా నిర్ణయించింది! మంచిదే… అయితే, గతంలో దీన్ని కాంగ్రెస్ ఎందుకు నిర్వహించలేదనీ, తెరాస పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు కదా…. గడచిన ఐదేళ్లు కూడా కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది, అప్పుడెప్పుడూ వారికి విమోచన దినం గుర్తుకురాలేదా.? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా దీని గురించి పెద్దగా మాట్లాడింది లేదు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచేసరికి, ఇక్కడ పార్టీ విస్తరణకు ఆస్కారం ఉంది కాబట్టే… ఇప్పుడీ సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను భాజపా గుర్తించిందని అనుకోవాలి! మరో వారంలో ఆ ఉత్సవాన్ని భాజపా నిర్వహించనుంది కాబట్టి, ప్రజలందర్నీ ఒక్కసారి తమవైపు తిప్పుకోవాలి కాబట్టి… దానికి కావాల్సిన ఎమోషనల్ గ్రౌండ్ భాజపా నాయకులు సెట్ చేసిపెడుతున్నట్టుగా ఉంది.