రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. మార్చి ఆరవ తేదీన రాజమండ్రిలో నిర్వహించబోయే ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ జైన్ తెలిపారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నిటి కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగింది కనుక రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన మీడియాకి తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సభలో వక్తలు రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని ఆయన తెలిపారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడిని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరారు. కానీ వారి నుండి ఆయనకు నిర్దిష్టమయిన హామీ ఏదీ లభించలేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాత్రం రైల్వే జోన్ ఏర్పాటుకి సానుకూలంగా స్పందించారు. కానీ అది ఎప్పుడు ఏర్పాటు అవుతుందో తెలియదు. మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్యాకేజి వంటి ప్రధానమయిన హామీలనన్నిటినీ అమలుచేసి ఉండి ఉంటే ఈ బహిరంగ సభకు మంచి ప్రజాధారణ ఉండేది కానీ వాటిని ఇంతవరకు అమలు చేయకపోవడం వలన ఈ బహిరంగ సభలో పాల్గొనబోయే బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఆ విషయంలో ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోక తప్పదు. ప్రజలకు ఇచ్చిన హామీలను రెండేళ్ళయినా అమలు చేయకుండా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో ఇటువంటి బహిరంగ సభలు నిర్వహించినా ఆశించిన ప్రయోజనం దక్కక పోవచ్చును.