తమిళనాడు శాసనసభకి మే16న ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకే అమ్మ (జయలలిత)ని ప్రసన్నం చేసుకొని, ఆమె పార్టీ (అన్నాడిఎంకె)తో పొత్తులు పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడి చాలా ప్రయత్నించారు. కానీ అమ్మ కరుణించలేదు. ఆ రాష్ట్రంలో ఉన్న మరో ప్రధాన పార్టీ-డి.ఎం.కె. అప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఫిక్స్ అయిపోవడంతో, ఆ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న మూడో ద్రవిడ పార్టీ-డి.ఎం.డి.కె.తో సర్దుకుపోవాలని భాజపా ప్రయత్నించింది. కానీ ఆ పార్టీ అధినేత విజయ్ కాంత్ అచ్చం తన సినిమా స్టయిల్లో “నేను కింగ్ అవ్వాలనుకొంటున్నాను తప్ప కింగ్ మేకర్ కాదు. ఎన్నికలలో ఎవరితో పొత్తులు మాకవసరం లేదు. ఒంటి చేత్తోనే మా పార్టీని గెలిపించుకోగాలను,” అని పంచ్ డైలాగ్ కొట్టి భాజపాకి షాక్ ఇచ్చారు. అప్పటికీ తమతో చేతులు కలిపినట్లయితే ఆయననే తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తామని భాజపా నచ్చజెప్పాలని చూసింది కానీ విజయ్ కాంత్ అంగీకరించలేదు.
ఏదో ఒక పార్టీ ‘ద్రవిడ స్టాంప్’ వేయించుకొంటే తప్ప ఎంత పెద్ద జాతీయపార్టీనయినా అక్కడి ప్రజలు పట్టించుకోరు. కానీ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా భాజపాకి ‘ద్రవిడ స్టాంప్’ అరువివ్వకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. వీటన్నిటికీ ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తున్న హీరో రజనీ కాంత్ ని కూడా ఆ మధ్యన ప్రధాని నరేంద్ర మోడి గోకారు కానీ ఆయన యధాప్రకారం ఆకాశంవైపు చూపిస్తూ ఆ పైనున్న వాడి నుంచి ఇంకా ఆదేశం రాలేదంటూ తప్పించుకొన్నారు.
ఈ నేపధ్యంలో తమిళనాడులో భాజపా ఏవిధమయిన వ్యూహం అనుసరిస్తే కనీసం గౌరవ ప్రధమయిన సీట్లు సంపాదించుకోవచ్చును. రాష్ట్రంలో తమను ఒడ్డున పడేసే వేరే శక్తులు ఏమయినా ఉన్నాయా? లేకుంటే ఎన్నికలలో ఏవిధంగా ముందుకు సాగాలి? అనే విషయాలపై తన పార్టీ నేతలతో చర్చించేందుకు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవ్వాళ్ళ చెన్నై వెళుతున్నారు.
ఆయన ఇవ్వాళ్ళ సాయంత్రం చెన్నై చేరుకొని అక్కడి నుంచి నేరుగా కంచికి వెళ్లి కంచి కామకోటి పీఠాదిపతి స్వామీ జయేంద్రసరస్వతిని కలుస్తారు. ఆ తరువాతః పార్టీ నేతలని కలిసి మాట్లాడిన తరువాత కేరళ వెళతారని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్య రాజన్ తెలిపారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత పర్యటన తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తునది కాదని ఆమె తెలిపారు. అయితే చెన్నై నుండి ఎన్నికలు జరుగబోయే కేరళ రాష్ట్రానికి అమిత్ షా వెళుతున్నారు కనుక ఇది ఆయన వ్యక్తిగత పర్యటన కాదని స్పష్టం అవుతోంది.
జయలలిత భాజపాని కాదన్న తరువాత ఆమె తీవ్రంగా వ్యతిరేకించే స్వామి జయేంద్రసరస్వతిని పనిగట్టుకొని అమిత్ షా ఎందుకు కలుస్తున్నట్లు? ఆయన ద్వారా రాష్ట్రంలోని వేరెవారినయినా (రజనీ కాంత్) ఒప్పించే ప్రయత్నం చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమయినప్పటికీ తమిళనాడులో ఎన్నికలకు ముందే భాజపాకి పూర్తి వ్యతిరేక వాతావరణం ఏర్పడిందని తప్పక చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ కిచ్చిన హామీలన్నిటినీ ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చి ఉండి ఉంటే, తమిళనాడులో పార్టీలు, ప్రజలు కూడా భాజపాని విశ్వసించేవారేమో.