బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పొందిన తరువాత పార్టీలో సీనియర్లు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత కుమార్ ప్రధాని నరేంద్ర మోడి, అమిత్ షాలను తీవ్రంగా విమర్శిస్తూ లేఖాస్త్రం సందించారు. బిహార్ ఎన్నికలలో పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడి, అమిత్ షాలే స్వంతం చేసుకొంటారని, కానీ పార్టీ ఓడిపోగానే సమిష్టి బాధ్యత వహించాలని చెప్పడం సబబు కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు. బిహార్ ఎన్నికలలో పార్టీ అపజయం చూస్తే, డిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీ ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఓటమిపై పార్టీలో లోతుగా సమీక్ష జరపాలని దానిలో మోడీ, అమిత్ షాలు పాలుపంచుకోకూడదని వారు తమ లేఖలో కోరారు.
వారు వ్రాసిన ఆ బహిరంగ లేఖకి మోడీ అనుకూల వర్గంలోకి వెంకయ్యనాయుడు వంటి నేతలు ధీటుగా స్పందించారు. రాజకీయ పార్టీలకి ఎన్నికలలో గెలుపోటములు సర్వసాధారణమయినవని, ఒక ఎన్నికలలో ఓడిపోవచ్చు..మరో ఎన్నికలలో గెలవవచ్చని అంత మాత్రాన్న పార్టీ నిర్ణయాన్ని, వ్యూహాలని తప్పు పట్టడం సరికాదని అన్నారు. ఇంతవరకు జరిగిన అనేక ఎన్నికలలో బీజేపీ జయాపజయాలు రెండూ చవి చూసిందని, బిహార్ ఎన్నికల ఫలితాలు కూడా వాటిలో ఒకటిగానే చూడాల్సి ఉంటుందని అన్నారు.
పార్టీలో సీనియర్ నేతల నుండి విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడి, అమిత్ షా మాత్రం ఇంతవరకు వాటిపై నేరుగా స్పందించలేదు. కానీ అమిత్ షా బహుశః వారినే ఉద్దేశ్యించి ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. మధ్యప్రదేశ్ లో చిత్రకూట్ లో ఒక స్వచ్చంద సేవా సంస్థ నెలకొల్పిన అత్యాధునిక ఆసుపత్రి ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యాతిధిగా పాల్గొన్న అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ “రాజకీయనాయకులు 60సం.లు వయసు వచ్చిన తరువాత రాజకీయాలలో నుండి తప్పుకొని సన్యాసం తీసుకొని సమాజాసేవ, మానవసేవా కార్యక్రమాలలో పాల్గొంటే బాగుంటుంది,” అని అన్నారు.
గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినపుడే ‘ఆ నలుగురు’ తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో అద్వానీ తన నిరసనను తెలియజేస్తూ పార్టీలో తన పదవులకు రాజీనామా చేసేసారు. అప్పుడు వారికి ఏదో విధంగా అందరూ కలిసి నచ్చ జెప్పారు కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమిత్ షాను పార్టీ అధ్యక్షుడుగా నియమించి, పార్టీలో ‘ఆ నలుగురు’ సీనియర్ నేతలను పూర్తిగా పక్కనపెట్టేసారు. అప్పటి నుండి వారు మోడీ, అమిత్ షాలపట్ల తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలయినప్పుడు వారందరూ కలిసికట్టుగా అసమ్మతి రాగం ఆలపించారు. వారిక రాజకీయాలలో నుండి రిటైర్ అయిపోతే బాగుటుందని అమిత్ షా సూచిస్తున్నారు.