ఎటువంటి అర్హత, సామర్ధ్యం ఉన్నా లేకపోయినా దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలని కలలుగన్నవారు ఇంకా కంటున్నవారు చాలా మందే ఉన్నారు. వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకరు. చాలా కాలంపాటు ఎన్డీయే కూటమిలో కొనసాగిన ఆయన బీజేపీ మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనని తమ యూపిఏ కూటమిలోకి ఆకర్షించాలని చాలా ప్రయత్నించింది. అందుకోసం బీహార్ కి భారీ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా సిద్దపడింది.
బీహార్ రాష్ట్రాభివృద్దే తన ధ్యేయం అని చెప్పుకొనే నితీష్ కుమార్ కి నిజంగా చిత్తశుద్ది ఉండి ఉంటే, యూపీఏలో చేరి రాష్ట్రానికి ప్రయోజనం కల్పించేవారు. కానీ ఆయనకి ప్రధానమంత్రి అయిపోవాలని తాపత్రయపడుతున్నందున యూపీఏ కూటమిలో చేరలేదు. ఎందుకంటే యూపీఏలో ప్రధానమంత్రి సీటు రాహుల్ గాంధీ కోసం శాస్వితంగా రిజర్వ్ చేయబడి ఉంటుంది. నితీష్ కుమార్ తన పదవీ లాలసతో బీహార్ రాష్ట్రానికి దక్కవలసిన భారీ ఆర్ధిక ప్యాకేజీని వదిలేసి తీరని నష్టం కలిగించారు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఎన్నికలకు వెళుతున్నారు. అదే పని మొదటే చేసి ఉండిఉంటే బీహార్ రాష్ట్రానికి సుమారు రూ.50, 000 కోట్లు ఆర్ధిక ప్యాకేజి దక్కి ఉండేది.
ఇదే విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. సుపౌల్ అనే ప్రాంతంలో నిన్న బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ, “నితీష్ కుమార్ పార్టీ కేవలం ఒక్క బీహార్ రాష్ట్రానిమి మాత్రమే పరిమితమయింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఆయన పార్టీ-జేడీయూ గురించి తెలిసినవారే లేరు. అందుకే ఆయనను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించలేదు. దానితో ఆగ్రహించి ఆయన ఎన్డీయే నుండి బయటకు వెళ్లి పోయారు. కానీ ఆయన ఏమి చేసినా ప్రధాని అవ్వలేరు. కానీ అవుతానని కలలు కంటున్నారు. అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. బీహార్ రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చింది లాలూ ప్రసాద్ యాదవేనని మొదట విమర్శించిన వ్యక్తి నితీష్ కుమారే. కానీ ఇప్పుడు అదే లాలూతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. నైతిక విలువలు లేని అటువంటి వ్యక్తులను బీహార్ ప్రజలు దూరంగా ఉంచవలసిన అవసరం ఉంది. లేకుంటే అవినీతికి మారుపేరయిన లాలూ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించడమ ఖాయం. తన ప్రభుత్వం చాలా సమర్ధంగా పరిపాలిస్తోందని నితీష్ కుమార్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బీహార్ లో అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే బీహార్ ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసలు వెళ్ళవలసి వస్తోంది?” అని ప్రశ్నించారు.