జె.ఎన్.టి.యు. విద్యార్దుల అరెస్ట్ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీల రాజకీయ పోరాటంగా మారిపోయింది. జె.ఎన్.టి. యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ అనే విద్యార్ధి అద్వర్యంలో ముంబై దాడుల సూత్రదారులలో ఒకడయిన అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించి, పాక్ అనుకూల నినాదాలు చేసినందుకు పోలీసులు కొందరు విద్యార్ధులను అరెస్ట్ చేసారు. దానిని కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించిన రాహుల్ గాంధి, నరేంద్ర మోడీ పరిపాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని ఎద్దేవా చేసారు.
దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంతే ఘాటుగా బదులిచ్చారు. “మోడీని విమర్శిస్తున్న రాహుల్ గాంధికి ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పరిపాలనను ఓమారు గుర్తు తెచ్చుకొంటే మంచిది. దేశంలో ఎమర్జన్సీ విధించి ఆమె హిట్లర్ లాగ పరిపాలించాలనుకొన్నారు. కాంగ్రెస్ డి.ఎన్.ఏ.లోనే హిట్లర్ పోకడలు కనబడుతుంటాయి. రాహుల్ గాంధికి జాతీయభావానికి, జాతి వ్యతిరేకతకు మధ్య తేడా తెలియదనిపిస్తోంది. అందుకే ఆయన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని వెనకేసుకొని వస్తున్నట్లున్నారు. జె.ఎన్.టి.యు.లో విద్యార్దులు చేసింది దేశ వ్యతిరేక చర్యగానే చూడాలి తప్ప దానిపై రాజకీయం చేసి అటువంటి వారిని ప్రోత్సహించడం మంచిది కాదని రాహుల్ గాంధి గ్రహిస్తే మంచిది. అవగాహన రాహిత్యంతో ఆయన ఒక వేర్పాటువాదిలా మాట్లాడుతున్నారు,” అని విమర్శించారు.
కొన్ని రోజుల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రోహిత్ అనే విద్యార్ధి మరణించినపుడు రాహుల్ గాంధి హడావుడిగా అక్కడికి చేరుకొని రాజకీయాలు చేసారు. ఆ తరువాత మళ్ళీ ఆయన ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు జె.ఎన్.టి.యు.లో విద్యార్ధులకు సంఘీభావం తెలుపుతున్నారు. త్వరలో దీనిని కూడా పక్కనపడేసి మరో సమస్య పట్టుకొంటారేమో? ఏదో ఒక బలమయిన కారణంతో మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా నష్టపరచాలనే తప్ప ఆ సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ది, ఆ సమస్యతో ముడిపడున్న విద్యార్ధుల పట్ల సానుభూతి గానీ రాహుల్ గాంధిలో కనబడటం లేదు. మోడీ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో యూనివర్సిటీ విద్యార్ధులతో ఘర్షణ పడుతోంది. దాని వలన బీజేపీకి చాల నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.