బీజేపీ అధ్యక్షుడు నడ్డా సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ పర్యటనకు వచ్చారు. అయితే వైసీపీ విషయంలో విమర్శలు చేయడానికి ఆయన చాలా మొహమాట పడినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో అమలవుతున్న స్కీములు కేంద్ర ప్రభుత్వానివే అని చెప్పడానికి సమయం కేటాయించారు కానీ.. ఇతర విషయాలపై స్పందించలేదు. బీజేపీకి చెందిన బూత్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నడ్డా.. తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది పథకాల విషయంలోనే.
రైతులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కేంద్రానిదని.. అలాగే ఆరోగ్యశ్రీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకమేనన్నారు. అంతే తప్ప.. ఏపీ లో ప్రస్తుతం ఉన్న ఇతర సమస్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఆయన రెండు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తారు. మంగళవారం బహిరంగసభ ఉంది. అందులో ఏమైనా విమర్శలు చేస్తారేమో కానీ.. పార్టీ బూత్ కమిటీ కార్యకర్తలకు ఇచ్చిన సందేశంలో మాత్రం జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ కనిపించడం .. కొంత మందికి మింగుడు పడని అంశంగా మారింది.
జనసేన ప్రస్తావన కూడా ఆయన నోటి నుండి రాలేదు. కనీసం కలుపుకుని వెళ్లాలన్న సూచనలు కూడా చేయలేదు. రెండు రోజుల పాటు విస్తృత సమావేశాల్లో పాల్గొనునన్న నడ్డా నుంచి కాస్త క్లారిటీని జనసేన నేతలు కోరుతున్నారు. వైసీపీని తీవ్రంగా టార్గెట్ చేస్తే సరే.. లేకపోతే .. తాము ఏదో పొలిటికల్ పావుగా మారామన్న అబిప్రాయానికి వారు వచ్చే అవకాశం కనిపిస్తోంది.