తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా తాము ఎదుగుతున్నామని మొదట్నుంచీ చెప్పుకొచ్చిన భాజపా, ఫలితాల దగ్గరకు వచ్చేసరికి చతికిలపడిన పరిస్థితి తెలిసిందే. పార్టీ ప్రముఖులు అని చెప్పుకునేవారంతా ఓటమి పాలయ్యారు. వందకుపైగా సీట్లలో పోటీ చేస్తే… ఒక్కటంటే ఒక్కటే దక్కిన పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఈవీఎమ్‌ల టాంపరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాలు చాలా ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిసి మొత్తం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించాయన్నారు.
అడుగడుగునా అధికార దుర్వినియోగం జరిగిందనీ, లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయన్నారు లక్ష్మణ్. ఈ పరిస్థితిపై ఎన్నికల కమిషన్ కేవలం క్షమాపణలు చెప్పేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో అనేకమంది నాయకుల భవిష్యత్తులు తారుమారయ్యాయన్నారు. దానికి పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్ వహించాలన్నారు. తాము మొదట్నుంచీ చెబుతూ వచ్చామనీ, రాష్ట్రంలో పరిస్థితిపై శ్వేతపత్రం ఇచ్చామనీ, అయినా ఈసీ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని ఆరోపించారు. ఓట్లు పడిన సంఖ్యకీ, లెక్కింపునకీ చాలా వ్యత్యాసం ఉందన్నారు. కనీసం ఇప్పటికైనా బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు, రాఫెల్ డీల్ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడుతూ… ఇది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిందన్నారు. అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందనీ… మోడీ హయాంలో పాలన పారదర్శకంగా ఉందని చెప్పడానికి సుప్రీం ఇచ్చిన తీర్పు మరోసారి స్పష్టం చేసిందన్నారు.
తెలంగాణలో భాజపా ఓటమికి అధికార దుర్వినియోగం, సాంకేతిక లోపంగా మాత్రమే లక్ష్మణ్ చూస్తున్నట్టున్నారు. నిజానికి, దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా పాగావేయాలనే భారీ లక్ష్యం, ఘోరంగా ఫెయిలైన సందర్భమిది. సాక్షాత్తూ ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ పెట్టినా కూడా కనీసం పది సీట్లైనా గెలుచుకోలేని పరిస్థితి. వాస్తవానికి రాష్ట్ర నాయకత్వం వైఫల్యమిది. సరే, ఇతర రాష్ట్రాల్లో ఓటమికి భాజపా ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత అని విశ్లేషించుకున్నా… తెలంగాణకు వచ్చేసరికి పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. దీన్ని స్వయంకృతంగా తీసుకుని చర్చిస్తే తప్ప… రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కోలుకోలేని పరిస్థితి భాజపాకి ఉంది.