ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల భాజపా అధ్యక్షుల పదవీకాలం ముగుస్తున్నందున త్వరలోనే వారి స్థానంలో కొత్తవారిని అధ్యక్షులుగా నియమిస్తారని అందరూ ఊహించారు. కానీ ఏప్రిల్ 4నుంచి మే16 వరకు అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున, అవి పూర్తయిన తరువాతే రెండు తెలుగు రాష్ట్రాలకి అధ్యక్షులను నియమించవచ్చని భాజపా నుంచి అనధికార సమాచారం అందింది. తెలంగాణా భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ కాలం ఫిబ్రవరిలోనే ముగిసిపోయింది. ఆంద్ర ప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు పదవీ కాలం కూడా త్వరలోనే ముగియబోతోంది. కానీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్తవారిని నియమించే అవకాశం లేకపోతే వారే తాత్కాలికంగా అధ్యక్షులుగా కొనసాగవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా అధ్యక్ష పదవికి సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ హరిబాబుతో సహా కన్నా లక్ష్మినారాయణ వంటి మరి కొందరు నేతలు కూడా ఆ పదవి కోసం ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో బీసీలకు చెందిన ఎమ్మెల్యే డా. కె. లక్ష్మణ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు భాజపా అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్. రామచంద్ర రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి ఆ పుదుచ్చేరితో సహా ఆ నాలుగు రాష్ట్రాలలో కూడా భాజపా పాలకవర్గాలని పునర్వ్యవస్తీకరించాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.