తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయం తెలంగాణ బీజేపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజల్ని విజయవంతంగా రెచ్చగొడుతున్నారన్న భావనతో వారు నేరుగా ఢిల్లీ వెళ్లి .., విరుగుడు చూపించాలని వేడుకున్నారు. బీజేపీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని… తమ మీడియాను విస్తృతంగా వాడుకుంటోందని బండి సంజయ్ నేతృత్వంలోని బృందం తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న బీజేపీ పెద్దలకు మొర పెట్టుకుంది.
పార్లమెంట్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చేసిన రచ్చ.. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం విషయాన్ని కేంద్రానికి అపాదిస్తూ రెచ్చగొడుతున్న వైనాన్ని కూడా వివరించారు. వాస్తవానికి సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51శాతం పాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నా, సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందంటూ కార్మికులను రెచ్చగొడుతున్నారని కానీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని బండి సంజయ్ బృందం వాపోతోంది. బయ్యారంలో 0ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చెప్పినా కేంద్రంపై నిందలేస్తున్నారన్నారు. సెంటిమెంట్ రెచ్చగొట్టాడనికి అన్నీ చేస్తున్నారన్నారు.
అయితే అన్నీ విన్న బండి సంజయ్ బృందానికి హైకమాండ్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ చేస్తున్న రాజకీయాలపై స్పష్టత ఉందన.ి. యూపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణపై కార్యాచరణ ఉంటుందని భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీతో నోటీసులు జారీ చేయించారు. 72 గంటల్లోగా లోక్‌సభ స్పీకర్‌కు వివరణ ఇవ్వాలని సూచించింది.