మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడాన్ని భారతీయ జనతా పార్టీ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. పార్టీ అగ్రనేతలు కూడా ఎంతో ప్రయారిటీ ఇస్తున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విచిత్రంగా కిరణ్ కుమార్ రెడ్డి గేమ్ ఛేంజర్ అని కర్ణాటక ఎన్నకిల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటామని బీజేపీ హైకమాండ్ చెబుతోంది. పార్టీలో చేరిక కార్యక్రమానికిపెద్దలు ఎవరూ రాకపోయినా… నడ్డా, అమిత్ షా సహా కీలక నేతలంతా ఎక్కువ సమయం కేటాయించి కిరణ్ తో చర్చలు జరుపుతున్నారు.
ఏపీలో బీజేపీ పరిస్థితిపై చర్చించడానిక సోము వీర్రాజును ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణలోనూ కిరణ్ రెడ్డి ప్రభావం ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన రాజంపేట నుంచి పోటీ చేస్తారని.. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా బీజేపీ వర్గాల నుంచి వస్తున్న లీకులే. ఇప్పటి వరకూ బీజేపీలో ఆ స్థాయి నేత లేడన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. వరుసగా పెద్ద నేతలతో సమావేశాలకు కిరణ్‌ను ఆహ్వానిస్తున్నారు.
ఏపీ వరకూ బీజేపీ హడావుడి చేస్తే పర్వాలేదనుకోవచ్చు కానీ దక్షిణాది మొత్తం ఆయనను మించిన నేత లేడనట్లుగా ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనపిస్తూండటమే హాట్ టాపిక్ అవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆయనేం చేస్తారని అక్కడి నేతలు పెదవి విరుస్తున్నారు. ఎనిమిదేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నేతను చేర్చుకుని… ప్రత్యేకంగా బలం, బలగం లేకపోయినా ఎందుకు హైప్ ఇస్తున్నారో బీజేపీకే తెలియాల్సి ఉంది.