కాశ్మీరు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ భాజపా అనూహ్య నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పాలన దిశగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయనీ, శత్రుదేశాల జెండాలతోపాటు ఉగ్రవాద సంస్థల పతాకాలు కూడా కాశ్మీరు లోయలో ఎగురుతున్నాయన్న చర్చ ఈ మధ్య తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితికి కారణం పీడీపీ నాయకత్వమే అనే అభాండం భాజపా వారిపై వేసేసింది. అయితే, అంతమాత్రాన ఆ అంశంతో తమకు సంబంధం లేదన్నట్టు భాజపా వ్యవహరించడం లేదు. దీన్ని రాజకీయంగా తమకు కలిసొచ్చే అంశంగా మార్చుకునే అజెండాతో భాజపా పావుల్ని కదుపుతోందన్న పరిస్థితి కనిపిస్తోంది.
త్వరలో కాశ్మీరుకి కొత్త గవర్నర్ రాబోతున్నారు. ఐబీ మాజీ ఛీఫ్ దినేశ్వర్ శర్మను నియమించబోతున్నారు. అంటే, కాశ్మీరును తమ గుప్పిట్లోకి తెచ్చుకుని, అక్కడి అరాచ శక్తులపై ఉక్కుపాదం మోపనున్నామనే సంకేతాలు కేంద్రం ఇస్తోంది. అయితే, పాకిస్థాన్ తో చర్చలు జరపాలనీ, కాల్పుల వివరణ పాటించాలంటూ మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. అలాంటి నాన్చుడు ధోరణి ఇకపై ఉండదని భాజపా నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక, గడచిన వారంలోనే హోం మంత్రి కూడా సరిహద్దులో పరిస్థితిపై తీవ్రంగానే స్పందించారు కదా! కాల్పుల విరమణలు లాంటివి ఇక లేవనీ, ఏదో ఒకటి తేల్చుకోవడమే అన్నట్టు మాట్లాడారు. లోయలో ఎవరైనా జెండాలు ఎగరేయడాలు లాంటి చర్యలుంటే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చేశారు. తాజాగా సైన్యంతో కూడా ఈ అంశమై చర్చించినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ సంకేతాల ద్వారా భాజపా ఆశిస్తున్న రాజకీయ లబ్ధి కోణం స్పష్టంగానే ఉంది. కాశ్మీరులో పరిస్థితిని మెరుగుపరచడం కోసం తాము అధికారం వదులుకున్నామనీ, రాజకీయాలు పక్కనపెట్టేశామనీ, దీన్నో త్యాగంగా ఇప్పటికే కమలనాథులు ప్రచారం చేయడం మొదలుపెట్టేశారు. ఈ వాదనకు బలంగా కాశ్మీరులోని తాజా పరిణామాలను చూపిస్తున్నారు. అంటే, రాబోయే ఏడాది కాలంలో కాశ్మీరులో శాంతి నెలకొల్పడం అనే భారీ లక్ష్యాన్ని భాజపా నెమ్మదిగా తలకెత్తుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇకపై ఇదే అంశాన్ని ప్రముఖంగా ఉంచే ప్రయత్నమూ చేస్తుంది. ఎందుకంటే, ఓపక్క ముందస్తు ఎన్నికలు అంటున్నారు. అదికాకున్నా, ఏడాదిలోగా ఎన్నికలు ఖాయం. ఈలోగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కాబట్టి, ఈలోగా కార్గిల్ లాంటి మరో యుద్ధం ఏదైనా వస్తుందా అనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. సో… భాజపా హిడెన్ అజెండా ఇదే అనే అభిప్రాయం కలుగుతోంది. ఈ అంశాన్ని జాతీయతా భావం అనే ఎమోషనల్ ఇష్యూగా మార్చి, తద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రయోజనాల పొందాలనే వ్యూహంలో భాజపా ఉందనే బలమైన అభిప్రాయం వినిపిస్తోంది.