ఈ మధ్య త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా గెలిచింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న సీపీఎంని మట్టి కరిపించింది. త్రిపురలో వ్యూహకర్తల్లో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ… త్రిపురలో తమకు 40 స్థానాలు వస్తాయని తాను ముందు నుంచీ చెబుతున్నా, ఎవ్వరూ నమ్మలేదన్నారు. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ మాట చెప్పినా ఆయనా నమ్మలేదన్నారు. నిఘా వర్గాలు కూడా అక్కడ 15 స్థానాలకు మించి రావనే చెప్పాయన్నారు. అయితే, ప్రభుత్వాలు ఎంత బాగా పాలించినా చివరి ఆరు నెలల్లో పరిస్థితి తారుమారు అవుతుందన్నారు. ప్రతీ దశలోనూ వ్యూహాలకు పదునుపెడుతూ, సీపీఎం కంటే అన్నింటా ముందుండేలా వ్యవహరించామన్నారు. ప్రచారాన్ని భారీ ఎత్తున పక్కా వ్యూహాత్మకంగా చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ గురించి కూడా రామ్ మాధవ్ మాట్లాడారు..! ఆంధ్రాని తాము రాజకీయంగా చూడటం లేదన్నారు. ఏపీ అంటే తమకు ఒక అభివృద్ధి అంశమే అన్నారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోందేమోగానీ, ఆంధ్రాని అభివృద్ధి చెయ్యడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారన్నారు. రాజకీయాల్లో దేన్నీ తెగే వరకూ లాక్కూడదని, రాజకీయ సమీకరణల్లో మార్పు అనేది సహజమని రామ్ మాధవ్ చెప్పారు.
త్రిపుర గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలే మాట్లాడారు. చివరి ఆర్నెల్లే తమకు ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. కానీ, ఆంధ్రా అంశం వచ్చేసరికి అభివృద్ధి బాధ్యత గుర్తొచ్చేసింది..! ఇవాళ్ల ఆంధ్రాలో భాజపాకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. దానికి కారణం మాత్రం మాట్లాడరు. గడచిన నాలుగేళ్లుగా ఏపీ విషయంలో భాజపా ఏం చేసిందో రామ్ మాధవ్ చెబితే బాగుండేది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ్ల అధికార పార్టీ కేంద్రంపై పోరాటానికి దిగితే.. అది రాజకీయ అవసరం అంటున్నారు. ఏపీ విషయంలో భాజపా అవసరం ఏంటో అందరికీ తెలిసిందే కదా. ఆంధ్రాలో సోలోగా ఆ పార్టీ ఏమాత్రమూ ప్రభావం చూపలేదన్నది వారికీ తెలుసు. కేవలం రాజకీయ అవసరాల ప్రాతిపదికనే.. ఆంధ్రాను నిర్లక్ష్యం చేసినా ఫర్వాలేదనే ధీమాతో భాజపా ఉంది. ఈ మధ్య ఒడిశా మీదా, కర్ణాటకల మీద భాజపాకి ప్రేమ ఎందుకు ఎక్కువైంది..? దాని వెనక ఉన్నది రాజకీయ అవసరాల నేపథ్యమా కాదా..? లేదంటే, చివరి ఆరునెలల ఫార్ములానా..?