తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకపోయినట్లయితే భాజపాతో పొత్తులు కొనసాగించడం కష్టం,” అని అన్నారు. ఆయన పార్టీలో చాలా సీనియర్ నేత, పైగా ఆయన మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించకపోవడం గమనిస్తే పార్టీ అధిష్టానం అభిప్రాయాన్నే ఆయన తెలియజేసినట్లు భావించవచ్చు.
సాధారణంగా ఇటువంటి సందర్భాలలో తక్షణమే స్పందించే రాష్ట్ర భాజపా నేతలు ఈసారి కొంచెం సమయం తీసుకోవడం గమనిస్తే వారు ఈ విషయంలో పార్టీ అధిష్టానం అనుమతి, మార్గ నిర్దేశం కోసమే ఎదురు చూస్తున్నారని అర్ధమవుతోంది. ఈరోజు భాజపా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మొట్టమొదట స్పందించారు. “మా పార్టీ పొత్తుల కోసం ప్రాకులాడే పార్టీ కాదు. రాజకీయాలలో విలువలకు చాలా ప్రాధాన్యం ఇచ్చే పార్టీ మాది. మా పార్టీని, మమ్మల్ని గట్టిగా తిడితే మంత్రి పదవి వస్తుందనే భ్రమలో ఉన్నట్లున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన తన పదవి కోసం ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పు లేదు కానీ అందుకు మా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడమే తప్పు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూనే ఉంది. అనేక హామీలను అమలుచేసింది. ఇకపై కూడా చేస్తుంది. అయినా తెదేపా నేతలు, మంత్రులు అనవసరంగా మమ్మల్ని నిందిస్తూనే ఉన్నారు. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఖర్చు చేసిందో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తాయి,” అని అన్నారు.
ఈరోజు డిల్లీలో భాజపా పార్లమెంటరీ సమావేశం జరుగుతోంది. అదే సమయంలో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో తెదేపా పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ రెండు సమావేశాలలో తెదేపా-భాజపా పొత్తుల విషయంపై ఆ పార్టీలు చర్చించే అవకాశం ఉంది. కనుక రెండూ చాలా ముఖ్యమయిన సమావేశాలే. ప్రస్తుత పరిస్థితులలో తెగతెంపులు చేసుకోవడం వలన రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుంది కనుక ఇరు పక్షాలు దీనిపై కొంత వెనక్కి తగ్గవచ్చు.