ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు జనసేనని పవన్ కళ్యాణ్ కాకినాడలో సభ పెట్టి, భాజపాని, వెంకయ్య నాయుడుని తిట్టిపోసిన తరువాత భాజపా నేతలు కూడా పవన్ కళ్యాణ్ కి అంతే ఘాటుగా సమాధానాలు చెప్పారు. వారు విమర్శిస్తున్న తీరు చూసి ఇక పవన్ కళ్యాణ్ న్ని వదులుకోవడానికి భాజపా సిద్దపడిందనే అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించిన విధంగా భాజపా కూడా వెనక్కి తగ్గి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలలో తప్పేమీ లేదని వాటిని పట్టించుకోనవసరంలేదని అనడం విశేషమే.
ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేకహోదా అంశంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనవసరంగా చాలా రాద్దాంతం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకే ప్రత్యేకహోదాకి ఏ మాత్రం తీసిపోని ప్రత్యేక ప్యాకేజిని ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం పరిస్థితి అర్ధం చేసుకొని ప్రత్యేకప్యాకేజి తీసుకొన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అర్ధం చేసుకొంటారని మేము భావిస్తున్నాము. ఆయన మాటలని మేము పట్టించుకోబోము. అవసరమైతే మేమే పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రత్యేక ప్యాకేజి ద్వారా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమీ అందించబోతోందో, వాటితో రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో వివరిస్తాము,” అని అన్నారు.
అవకాశం చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించే సోము వీర్రాజు మొదటిసారిగా ఆయన పట్ల కొంచెం సానుకూలంగా మాట్లాడారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కి నచ్చజెప్పేందుకే ఆయన ఆవిధంగా మాట్లాడారా లేకపోతే తెదేపాతో కలిసి సాగాలని భాజపా అధిష్టానం ఆదేశించినందున ఆవిధంగా మాట్లాడారా? అనే విషయం మళ్ళీ ఆయన మరోసారి మాట్లాడినప్పుడు ఆయన మాటలలోనే తెలుస్తుంది.
అదేవిధంగా భాజపా నేతలు మొదట పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడి ఇప్పుడు ఈవిధంగా వెనక్కి తగ్గి మాట్లాడటం కూడా బహుశః పార్టీ నిర్ణయమే అయ్యుండవచ్చు. తెదేపాని, పవన్ కళ్యాణ్ న్ని కూడా దూరం చేసుకొన్నట్లయితే రాష్ట్రంలో భాజపా ఒంటరి అయిపోవడమే కాకుండా వారే తమ పార్టీకి శత్రువులుగా మారితే చాలా నష్టం జరుగుతుందని భాజపా అధిష్టానం గ్రహించినందునే, ఇప్పుడు వెనక్కి తగ్గి పవన్ కళ్యాణ్ తో రాజీకి సిద్దపడుతోందని భావించవచ్చు.
పవన్ కళ్యాణ్ కూడా బహుశః భాజపాతో విరోధం కోరుకోకపోవచ్చు. ఎందుకంటే ఏదోవిధంగా రాష్ట్రాభివృద్ధి జరుగడమే ముఖ్యం తప్ప అది తప్పనిసరిగా ప్రత్యేకహోదాతోనే జరగాలని ఆయన పట్టుపట్టకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేన్నట్లయితే చేజేతులా తనకంటే బలమైన రాజకీయ శత్రువులని సృష్టించుకోవలసిన అవసరం అసలే ఉండదు. కనుక భాజపా నేతలు ఆయనతో రాజీపడి నచ్చచెప్పే ప్రయత్నం చేయడం మంచిదే.