రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద భాజపా చాలా ఆశలు పెట్టుకుంది. అధికార తెరాసపై పట్టు సాధించడమే లక్ష్యంగా పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమౌతున్న నేపథ్యంలో… భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు! మున్సిపల్ ఎన్నికలకు భాజపా సిద్ధంగా ఉందన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు తమకు సెమీ ఫైనల్స్ అనీ, తెరాసకి తిరోగమనం మొదలైందన్నారు. అదేంటీ.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస భారీ మెజారిటీతో గెలిచింది కదా, తిరోగమనం ఎక్కడుందీ అని ప్రశ్నిస్తే… దానికీ ఓ లాజిక్ చెప్పారు లక్ష్మణ్.
ఆంధ్రాలో చంద్రబాబు హయాంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగిందనీ, అక్కడ ఇంతకంటే భారీ మెజారిటీతో టీడీపీ గెలిచినా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలు ఓడించారన్నారు. ఇప్పుడీ హుజూర్ నగర్ ఫలితం కూడా నంద్యాల లాంటిందే అన్నారు. ఇకపై రాబోయే ఎన్నికల్లో తెరాస తిరోగమనం ప్రారంభమౌతుందన్నారు! పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో తన కుమార్తె ఓడిపోతే కనీసం ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ పెట్టలేదనీ, ఇప్పుడు హుజూర్ నగర్లో గెలవాలగానే పెట్టారంటూ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. హైకోర్టు చీవాట్లు పెడుతున్నా స్పందించని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవ్వరూ ఉండరనీ, కేసీఆర్ వ్యవహార శైలి మారకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు.
హుజూర్ నగర్లో కమలం పార్టీ ఏదో చేస్తుందని ఎవ్వరూ ఆసక్తి చూపలేదుగానీ… మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తెరాసకు ఎలాంటి పోటీ ఇస్తుందా అనే ఆసక్తి నెలకొని ఉంది. భాజపా నిజంగానే తెరాసకు సరైన పోటీ ఇవ్వగలదా లేదా అనేది ఈ ఎన్నికలు తేల్చాస్తాయనే చెప్పాలి. నగరంలో ప్రస్తుతం భాజపా చాలా యాక్టివ్ గానే ఉంది. అయితే, పార్టీపరంగా ఎన్ని కార్యక్రమాలు ఎలా చేపట్టినా, చివరికి వచ్చేసరికి పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విషయంలో తెరాస చాలా స్మార్ట్! అంతేకాదు… భాజపా నేతల ఈ దూకుడుకి కళ్లెం వెయ్యాలంటే గ్రేటర్ పరిధిలో విజయమే అవకాశమని ఆ పార్టీ కూడా భావిస్తుంది కదా. ఒకవేళ మున్సిపోల్ ఎన్నికల్లో భాజపాకి ఆశించిన సంఖ్యలో స్థానాలు రాకపోతే… లక్ష్మణ్ చెప్పినట్టు కచ్చితంగా ఇది సెమీఫైనల్సే అవుతుంది.