కశ్మీర్ ఫైల్స్.. కేరళ ఫైల్స్ తరహాలో తెలంగాణ ఎన్నికల కోసం రజాకార్ ఫైల్స్ ను.. బీజేపీ రెడీ చేస్తోంది. ఈ సినిమా పోస్టర్ని కూడా ఆవిష్కరించారు. బీజేపీ నేత గూడూరు నారాయణరావు సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలంతా కలిసి పోస్టర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్నారు.
నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాద పార్టీకి చెందిన పారామిలిటరీ వలంటీర్ దళాన్ని రజాకార్లుగా పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వీరి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి, భారత్లో విలీనానికి వ్యతిరేకంగా వీరి ప్రతిఘటించి పోరాటం చేశారు. అయితే.. అప్పట్లో వారు హిందువులతో పాటు ముస్లింలను కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేశారు. అంతేకాకుండా ప్రజల్లో విప్లవాన్ని రగిలించేందుకు ప్రయత్నించిన కమ్యూనిస్టులతో వీరు పోరాటం చేసినట్టు చరిత్రలో పలు ఆధారాలున్నాయి.
‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాల్లో ముస్లిం సమాజాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందని, పోరాటాల్లో ఆరితేరిన వారు కాబట్టి మంచి ఏది, చెడు ఏదన్న విషయాలను ఈజీగా గుర్తించగలరని ..రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే ఊరుకోరని అంటున్నారు.
ఈ సినిమాకు తెరవెనుక విజయేంద్ర ప్రసాద్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.