అనాలోచిత నిర్ణయాల కారణంగా వస్తున్న ప్రజా వ్యతిరేకతను తమపై నెట్టేందుకు చేస్తోన్న ప్రయత్నంపై బీజేపీ భగ్గుమంటోంది. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయాలని ఏపీ బీజేపీ నేతలు నిర్ణయించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అంశం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ సమయంలో.. ప్రధాని, కేంద్ర హోంమంత్రికి చెప్పిన అనంతరమే వారి అనుమతితో నిర్ణయం తీసుకున్నామని విజయసాయిరెడ్డి ప్రకటించుకోవడం.. బీజేపీ నేతలకు ఓ రకంగా షాక్ ఇచ్చినట్లయింది. పైగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్షపై ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్, యూరప్ దేశాలు వ్యతిరేకంగా లేఖలు రాశాయి. ఈ అంశంపై కేంద్రం నుంచి జగన్కు స్పష్టమైన సూచనలు వచ్చాయి. అయినా ఏపీ సర్కార్ లైట్ తీసుకుంది. ఇప్పుడు మొత్తం.. చెప్పే చేస్తున్నామని ప్రకటించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమకేటువంటి సంబంధంలేదని బీజేపీ నేతలు తెగేసి చెప్తున్నారు. నిర్ణయాలు తీసేసుకుని ఆ తర్వాత ప్రధానమంత్రి, హోంమంత్రికి చెప్పటం ఏమిటంటున్నారు. నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేక కేంద్ర ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చింది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని తెలిసి.. కేంద్రం ప్రమేయం లేకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం .. ధిక్కారం కాదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజధాని అంశంపై కూడా బీజేపీ మెడకు చుట్టాలని వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే… బీజేపీ నేతలు రాజధానిపై ఘాటుగానే స్పందిస్తున్నారు. నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించడం ప్రారంభించారు.
విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో బీజేపీ, వైసీపీల మధ్య సంబంధాలు ఉప్పు – నిప్పులా మారాయి. కేంద్రంలో బీజేపీ నేతలకు, పెద్దలకు ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరించాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం… నేరుగానే… ఆరోపణలు చేసి ప్రజల వద్దకు వెళ్లిందని.. కానీ ఇప్పటి సర్కార్… తమ అక్రమాల్ని నేరుగా మోడీ , షాలకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. వైసీపీ ప్రయత్నాల్ని మధ్యలోనే తెంచేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.