భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలంగాణాలో తెరాసతో సహా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని ప్రకటించారు. అది తెదేపాని ఉద్దేశ్యించి చేసినదేనా అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలు దూరం అయ్యాయి కానీ తెగతెంపులు చేసుకోలేదు. అలాగే ఒకదానిని మరొకటి విమర్శించుకోవడం లేదు.
నేటికీ తెదేపా, భాజపా నేతల మధ్య సంబంధాలు కూడా బలంగానే ఉన్నాయి. అటువంటప్పుడు తెరాసతో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఉంటే సరిపోయేది. కానీ దానితో సహా సహా ‘ఏ పార్టీతో’ పొత్తులు పెట్టుకోమని చెప్పడం తెదేపాని ఉద్దేశ్యించి అన్నట్లుగానే భావించవలసి ఉంటుంది.
అయితే ఇప్పుడే ఆ మాట స్పష్టంగా చెప్పడం చాలా తొందరపాటే అవుతుంది. చెపితే ఏపిలో తెదేపాతో ఇబ్బంది ఏర్పడుతుంది. కనుకనే చెప్పలేదనుకోవచ్చు. కానీ భాజపా తన ఉద్దేశ్యం స్పష్టం చేసినట్లే భావించి, రెండు రాష్ట్రాలలో తెదేపా అందుకు తగ్గ వ్యూహాలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకోవడం మంచిది.
తెలంగాణా, ఓడిశా రాష్ట్రాలలో భాజపా బలపడేందుకు చాలా అవకాశాలున్నట్లు తాము భావిస్తున్నామని, కనుక ఇకపై తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించి ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొంటామని మురళీధర్ రావు చెప్పారు. తెలంగాణాలో తెరాసతో ఎటువంటి పొత్తులు లేనందునే తెలంగాణాలో ముందడుగు వేసేందుకు భాజపా సంకోచించనవసరం లేదు. కానీ ఏపిలో తెదేపాతో స్నేహం కొనసాగిస్తున్నందున దానిని కాదని ముందుకు సాగడం సాధ్యం కాదు. సాగదలిస్తే తెగతెంపులు చేసుకోవలసి ఉంటుంది.
ప్రస్తుతానికి ఏపిలో రెండు పార్టీల మద్య సంబంధాలు అంత గొప్పగా లేకపోయినప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగించకతప్పడం లేదు. ఎవరి కారణాలు వారికున్నాయి. ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కనుక అప్పటి పరిస్థితులని బట్టి ఏపిలో తెదేపాతో కొనసాగడం మంచిదో కాదో నిర్ణయించుకోవచ్చు. తెదేపాతో ఏవిధంగా వ్యహరించాలనే దానిపై భాజపా అధిష్టానానికి కూడా స్పష్టత లేకపోవడం వలననే ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోలేకపోతోంది. కనుక ఏపిలో కూడా బలపడాలని ఆలోచించే ముందు, తెదేపాతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయం గురించి ఆలోచించడం మంచిది.