ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఫిరాయింపు నేతలకు పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణలో ఫిరాయింపు నేతల్లో ఒక్కరికి మంత్రి పదవి ఇస్తే… చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఫిరాయింపు రాజకీయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ, తెరాస వైఖరి సరైంది కాదనీ గతంలో అన్నారు. కానీ, ఇప్పుడు అదే వైఖరిని ఆయనే అనుసరించారు. ఈ తీరుపై ప్రజల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. జంప్ జిలానీలకు ఆమాత్య పదవులు కట్టబెట్టడంపై కేంద్రం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది..!
సాధారణంగా, చంద్రబాబు ఏం చేసినా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెనకేసుకొస్తారన్నది అందరికీ తెలిసిందే. ఏపీలో భాజపా ప్రయోజనాలను తుంగలోకి తొక్కిమరీ, చంద్రబాబుకు అండగా నిలుస్తుంటారనే విమర్శ ఉంది. అదే పరంపరలో ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై కూడా వెంకయ్య సమర్థన ఉండాలి. కానీ, ఆయన స్వరం మరోలా మారుతోందని అనిపిస్తుంది. జంప్ జిలానీలకు పదవులు ఇచ్చిన మరుసటి రోజునే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. పార్టీలు మారిన నేతలు రాజీనామాలు చేయాలని వెంకయ్య అన్నారు. ఆయా పార్టీల నుంచి సంక్రమించిన పదవుల్ని కూడా వదులుకోవాలన్నారు. ఈ మేరకు ఒక పటిష్టమైన చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.
ఏపీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో వెంకయ్య చేసినవి సంచలన వ్యాఖ్యలే. చంద్రబాబుపై కేంద్రం గుర్రుగా ఉందనేది వెంకయ్య వ్యాఖ్యల ద్వారా అర్థమౌతోంది. నేరుగా ఏపీ క్యాబినెట్ గురించి ప్రస్థావించకపోయినా… సందర్భం ఇదే కాబట్టి, వెంకయ్య వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలకు అన్వయించుకోవాల్సి వస్తోంది. ఓ రకంగా ఈ వ్యాఖ్యలు టీడీపీకి ఝలక్ అనుకోవాలి.
ఎక్కడైనా మామగానీ వంగ తోటకాడ కాదనే సామెత ఉంది. తెలుగుదేశం విషయంలో భాజపా వైఖరి రానురానూ స్పష్టమౌతున్నట్టుగానే భావించాలి. ఇప్పటికే, తెలంగాణలో టీడీపీతో తెగతెంపులు ఖాయమనే సంకేతాలు ఇస్తోంది. ఏపీలో విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు దారులకు చంద్రబాబు పదవులు ఇవ్వడం అనే ఇష్యూని భాజపా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ అంశంలో చంద్రబాబును వెంకయ్య వెనకేసుకొచ్చే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి.