నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరగగానే.. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు.. ఆయనను పార్టీలో చేర్చుకోవాలనే “వినూత్న ఆలోచన” చేసిన నెతలెవరా.. అని వెదికారు. ఎందుకంటే.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగి.. దశాబ్దాలు దాటిపోయింది. ఎన్టీఆర్ ను పదవీచ్యుడిని చేసి.. భంగపడిన సంక్షోభం తర్వాత.. ఆయన పొలిటికల్ రాడార్లో కనిపించలేదు. బయటకు కూడా రాలేనంత దుర్భర పరిస్థితుల్లో ఉండిపోయారు. మళ్లీ ఆయన కుమారుడు ఆరంగేట్రం చేస్తే తప్ప… బయట మొహం చూపించలేకపోయారు. అయినా.. ఆయన తెర ముందుకు మళ్లీ ఎప్పుడూ రాలేదు. అలాంటి నేతను.. ఇప్పుడు.. బీజేపీ నేరుగా పార్టీలో చేర్చేసుకుంది. ఆయనేమో.. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇక తనవేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటున్నారు.
నాదెండ్ల భాస్కర్ రావు వయసు ఎనభై మూడు సంవత్సరాలు. భారతీయ జనతా పార్టీ… పెట్టుకున్న నిబంధనల ప్రకారం… 70 ఏళ్లు దాటిన వారిని నిస్సంకోచంగా ఇంటికి పంపించేస్తున్నారు. వారెంత సీనియర్లు అయినా.. పార్టీ కోసం జీవితాన్ని ధారబోసినా.. రూల్స్ అంటే.. రూల్స్ అన్నట్లుగా మోడీ, షా వ్యవహరిస్తున్నారు. ఈ కారమంగానే అనేక మంది సీనియర్లను.. ఈ కారణంతోనే ఇంటికి పంపారు. ఇలాంటి పార్టీలో… 83 ఏళ్ల రాజకీయ నేతను… పార్టీలో చేర్చుకోవడానికి చర్చల.. చర్చల మీద చర్చలు జరపడం ఏమిటో.. చాలా మందికి అర్థం కాలేదు. అధికారికంగా రిటైర్మెంట్ ఇచ్చేసిన నేతను.. మళ్లీ… లాక్కొచ్చి.. ఏం సాధిస్తారనే చర్చ కూడా నడుస్తోంది.
నాదెండ్లకు వ్యక్తిగత ప్రాబల్యం కూడా ఏమీ లేదు. ఎన్నికలకు ముందు.. యూ ట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎన్టీఆర్పై నిందలేసి.. వైరల్ అయ్యారు తప్ప… ఆయనకు క్రెడిబులిటీ కూడా ఏమీ లేదు. పార్టీలో చేరేందుకు.. స్టేజిపై వచ్చిన నాదెండ్ల… అమిత్ షాకు… దండ వేయడానికి మూడు నిమిషాల సమయం తీసుకున్నారు. కవర్ లో ఉన్న దండ తీయడం ఆయన వల్ల కాలేదు. ఆలస్యం అవుతుందని.. పక్క వాళ్లు తీసి ఇస్తే.. అమిత్ షా మెడలో వేశారు. 83 ఏళ్ల వయసులో.. నడుచుకుంటూ స్టేజ్ మీదకు వస్తే చాలు.. కండువా కప్పొచ్చన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించారు. గత ఎన్నికలకు ముందు ఆయన కుమారుడు.. కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు తండ్రి.. బీజేపీలో కొత్తగా రాజకీయ జీవితం వెదుక్కుటున్నారు.