ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ అనాలోచితంగా చేసిన ఒక పిచ్చి పని, బీజేపీకి బ్రహ్మాస్త్రంగా ఉపయోగ పడే పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ లో విజయం తమదేననే ధీమాతో ఉన్న ఆప్ ను చావు దెబ్బ కొట్టడానికి ఈ అస్త్రాన్ని బీజేపీ ఉపయోగించ వచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఆప్ కు లోక్ సభలో నలుగురు సభ్యులున్నారు. వాళ్లంతా పంజాబ్ కు చెందిన వారే. వారిలో ఇద్దరు కేజ్రీవాల్ నిరంకుశ ధోరణిని పార్టీలోనూ, బయటా వ్యతిరేకించారు. తమ మీద ఢిల్లీ పెత్తనం ఏమిటని అనేక సార్లు ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరినీ గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే వారిద్దరూ ఆప్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టాలంటే ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధన అడ్డంకిగా ఉంది.
కనీసం మూడింట రెండు వంతుల మంది సభ్యులు తిరుగుబాటు చేసి వేరే గ్రూపుగా ప్రకటించుకుంటే అనర్హత వేటు పడదు. నలుగరిలో ఇద్దరు పార్టీ ఫిరాయిస్తే మూడింట రెండు వంతులు అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మాన్ పై అత్యంత తీవ్రమైన చర్య తీసుకోవడం ద్వారా ఆప్ పార్లమెంటరీ పార్టీని నిలువునా చీల్చడానికి బీజేపీ ఎత్తు వేయవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి.
మాన్ క్షమాపణ చెప్పినా సరిపోదని స్పీకర్ ప్రకటించారు. ఆయనపై కచ్చితంగా తగిన చర్య తీసుకుంటామన్నారు. అన్ని పార్టీల వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ యూపీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని చర్చించవచ్చు. పార్లమెంటు భద్రతను పణంగా పెట్టడంతో పాటు, ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరించారని రాజ్యసభలో మంత్రి నక్వీ ఆరోపించారు. దీన్ని బట్టి, మాన్ ను అనర్హుడిగా ప్రకటించాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతోంది. ఉభయ సభల్లో అన్ని పార్టీల సభ్యులూ మాన్ చర్యను ఖండించారు. ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఆయనపై చర్య తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రశ్నించారు.
ఒక వేళ మాన్ ను అనర్హుడిగా ప్రకటిస్తే అప్పుడు ఆప్ ఎంపీల సంఖ్య మూడుకు తగ్గుతుంది. అప్పుడు సస్పెండైన ఇద్దరు ఎంపీలు తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టడానికి అడ్డంకి ఉండదు. అదే జరిగితే ఆప్ కు ఒకే ఎంపీ మిగులుతారు. పైగా, ఉగ్రవాదులకు సహకరించే పార్టీగా ఆప్ పై ముద్ర వేయడం ద్వారా పంజాబ్ ఎన్నికల్లో ఇరుకున పెట్టడానికి బీజేపీ, అకాలీదళ్ ప్రయత్నించ వచ్చు. ఇంతకీ మాన్ పై ఎలాంటి చర్యను ఖరారు చేస్తారనే దాన్ని బట్టి, ఈ ప్రచారం నిజమా కాదా అనేది తేలిపోతుంది.