ఆంధ్రప్రదేశ్ కు చాలా చేశాం, ఇచ్చిన హామీలకు మించినవి చేశాం, ఇంకా చెయ్యాల్సినవి త్వరలో చేసేస్తాం… ఇదే మాటతో ఏపీలో ప్రచారం సాగించాలని భాజపా అనుకుంటూ వస్తోంది. కేంద్రం చేసిన సాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, చంద్రబాబు సర్కారు చేస్తున్న అబద్ధపు ఆరోపణల్ని ప్రజలకు వివరించొచ్చు అనేది ఆలోచన. అయితే, కేంద్ర సాయంపై ప్రచారానికి ఆదరణ అస్సలు లేదనే విశ్లేషణ ఇటీవల భాజపా నేతల మధ్య జరిగినట్టు సమాచారం. కేంద్ర సాయం గురించి ఎంత చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ, ఏపీకి భాజపా అన్యాయం చేసిందనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిపోయారంటూ ముఖ్యనేతలు తాజాగా విశ్లేషించుకున్నట్టు సమాచారం! రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటివి కేంద్రం త్వరలో చేస్తుందని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ అనుకున్నారట.
అందుకే, ‘కేంద్ర సాయం’ అనే అంశాన్ని నెమ్మదిగా పక్కనపెట్టి… ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల మీద దృష్టి పెట్టాలని రాష్ట్ర భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, పురందేశ్వరితోపాటు పలువురు ప్రముఖులు తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే, ఆధారాలు లేకుండా ఎన్ని ఆరోపణలు చేసినా ఫలితం ఉండదనీ, ప్రతిపక్ష నేత జగన్ ఇలానే చేస్తుండటం వల్ల ప్రజల్లో చర్చ జరగడం లేదనేది కూడా వారి మధ్య ప్రస్థావనకువ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే, ఇకపై ఆధారాల సేకరణ పనిలో పడాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ విభాగాల తరఫు నుంచి ఏవైనా చర్యలకు అవకాశాలున్నాయో త్వరలోనే చర్చిస్తారట! దీంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి, కీలక ప్రభుత్వ శాఖల్లో తమకు కాస్త అనుకూలంగా ఉండేవారిని గుర్తించి, అక్కడి నుంచి ఏదైనా సమాచారం రాబట్టే ప్రయత్నం చెయ్యాలనే వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. అవినీతి అనేది ఏ చిన్న స్థాయిలో ఉన్నా ఫర్వాలేదుగానీ, ఏదో ఒక ఆధారంతో ఇకపై ఆరోపణలు చేస్తే… ప్రజల్లో కొంత చర్చ జరుగుతుందనేది ఏపీ భాజపా నేతల తాజా వ్యూహంగా గుసగుసలు వినిపిస్తున్నాయి!
అయితే, ఈ క్రమంలో ఏపీ భాజపా నేతలు విశ్లేషించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని వదిలేస్తున్నారు! అదేంటంటే… కేంద్రం స్థాయికి మించి చేసిన సాయాన్ని ప్రజలు ఎందుకు నమ్మడం లేదు..? రైల్వేజోన్ గానీ, ఇతర హామీలుగానీ ఇస్తామని కేంద్రమే చెబుతుంటే ఆంధ్రా ప్రజలు ఎందుకు విశ్వసించడం లేదు..? భాజపాపై వ్యతిరేకత పెంచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే కోణం నుంచే పరిస్థితిని చూస్తున్నారు, అంతేగానీ… దాన్లో భాజపా వైఫల్యం ఏంటనే విశ్లేషణ ఏపీ నేతలు చేసుకోవడం లేదు..! భాజపా ఏం చేసినా నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని వారే నమ్ముతున్నప్పుడు… రాష్ట్ర ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారు..? ఇది మరో విఫలయత్నంగా అనిపించడం లేదా..? ఏపీలో ఆదరణ పెరగాలంటే… టీడీపీతో పోరాట మార్గాలు అన్వేషించే కంటే, విభజన చట్టంలోని హామీల అమలుపై భాజపా దృష్టి పెట్టాలి.