బీజేపీ నేతల నోటిదూలను కాంగ్రెస్ ఫర్ పెక్ట్ గా ఉపయోగించుకుంటోంది. మీ నానమ్మకు పట్టిన గతే మీకు పడుతుంది జాగ్రత్త అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను జమ్మూ – కశ్మీర్ ఎన్నికల పోలింగ్ రోజునే కాంగ్రెస్ హైలెట్ చేస్తోంది.
లోక్ సభలో ప్రతిపక్ష నేత,ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని, అందుకు బీజేపీ నేతలు వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలే నిదర్శమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ రాహుల్ గాంధీని చంపేస్తామని హెచ్చరించారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక , బీజేపీ మిత్రపక్షమైన మహారాష్ట్రలోని షిండే శివసేన ఎమ్మెల్యే , సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి 11 లక్షలు ఇస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో నేత రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటూ వ్యాఖ్యానించారని.. ఓ పథకం ప్రకారమే రాహుల్ గాంధీపై దాడి జరుగుతోందని..కాంగ్రెస్ శ్రేణులు పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగాయి.
ఇక, బీజేపీ, దాని మిత్రపక్షాల నేతల వ్యాఖ్యలతో కమలనాథులు ఇరుకున పడ్డారు. రెండు రోజులుగా ఈ విషయం వివాదాస్పదం అవుతున్నా.. సరిగ్గా ఈ వ్యాఖ్యలను పోలింగ్ రోజునే కాంగ్రెస్ హైలెట్ చేస్తుండటం విశేషం. దీంతో బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీల నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు.